దసరా రోజు రావణ శోభా యాత్ర.. జమ్మి ఆకులు తెంపడం మహా పాపమంటున్న గిరిజనులు !

దసరా రోజు రావణ శోభా యాత్ర.. జమ్మి ఆకులు తెంపడం మహా పాపమంటున్న గిరిజనులు !

గడ్చిరోలి: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో రావణ శోభా యాత్ర ఘనంగా జరిగింది. అహేరి తాలుకా కోడిసేలగూడలో దసరా పండుగ సందర్భంగా రావణ శోభా యాత్రను నిర్వహించారు. కోడిసేల గూడ నుంచి కమలపూర్ వరకు శోభా యాత్ర సాగింది. యాత్రలో పాల్గొనడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శోభా యాత్రలో పాల్గొనడానికి జపాన్, శ్రీలంక దేశాల నుంచి భక్తులు తరలివచ్చారు.

నవరాత్రులు నియమనిష్ఠలతో రావణ బ్రహ్మను అదివాసీలు పూజించారు. రావణుడు తమ దైవమని ఆదివాసీలు చెబుతున్నారు. జమ్మి ఆకులు తెంపడం  మహా పాపమని, జమ్మి ఆకులు తెంపితే అడవి నాశనం అవుతుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. రావణ దహనం చేయవద్దని, దైవంగా పూజించాలని ప్రజలను గిరిజనులు కోరుతున్నారు.

దసరా పండుగకు రామాయణం, మహాభారతం రెండింటితోనూ సంబంధం ఉంది. రామాయణం ప్రకారం.. లంకాధిపతి రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్తాడు. సీతను రక్షించేందుకు శ్రీరాముడు.. లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, వానర సేన సాయంతో లంకపై యుద్ధం చేస్తాడు. చివరకు రావణుడిని సంహరించి సీతాదేవిని తిరిగి తీసుకొస్తాడు. ఈ విజయానికి గుర్తుగా విజయదశమి వేడుకలు నిర్వహిస్తారు. 

ALSO READ : దసరా రోజు.. జమ్మిచెట్టుకు పూజ.. పాలపిట్ట దర్శనం.. విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!

రావణుడి భారీ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ, శ్రీరాముడి విజయాన్ని స్మరించుకుంటారు. రావణ దహనం ద్వారా చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని చాటిచెబుతారు. ఎంతటి శక్తి ఉన్నా అధర్మం చివరకు ఓటమి పాలవుతుందనే సందేశాన్ని ఈ రావణ దహనం చాటి చెబుతోంది. దుర్గుణాలను వదిలి సత్యం, న్యాయం, ధర్మం వైపు నడవాలనే ఆలోచనను గుర్తుచేస్తుంది.