సౌత్ ఇండియన్ సినిమా దగ్గర హారర్ థ్రిల్లర్లకు కొత్త నిర్వచనం చెప్పేందుకు '418 – ది నైట్మేర్ బిగిన్స్' సిద్ధమవుతోంది. ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లోని భయానక విజువల్స్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో హారర్ ప్రియులను ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 23న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి భయానక అనుభూతిని అందించబోతోందనే ఆసక్తి పెరుగుతోంది.
15 ఏళ్లుగా మూసి ఉన్న గది..
ఒక మెడికల్ కాలేజీ హాస్టల్.. అక్కడ దాదాపు 15 ఏళ్లుగా ఎవరికీ ప్రవేశం లేని గది నంబర్ 418. ఆ గది చుట్టూ అల్లుకున్న రహస్యాలు, అక్కడ చోటుచేసుకునే వింత సంఘటనలే ఈ కథకు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. ఆ గదిలో అసలేం జరిగింది? దాన్ని తెరిచేందుకు ప్రయత్నించే విద్యార్థులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనే ప్రశ్నలను ట్రైలర్ ఆసక్తికరంగా రేకెత్తిస్తోంది. ప్రతి సన్నివేశంలోనూ ఏదో తెలియని ప్రమాదం పొంచి ఉన్న భావనను కలిగిస్తూ ఉత్కంఠను పెంచుతోంది.
సాధారణ హారర్ సినిమాల్లో కనిపించే జంప్ స్కేర్స్కే పరిమితం కాకుండా, సీరియస్ ఇంటెన్స్ వాతావరణంతో ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా చైత్ర ఆచార్ పలికించిన హావభావాలు, భయానక సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ALSO READ : AK47 Release Date Official: వెంకీ మామ దసరా గిఫ్ట్..
వణికించేలా..
వెంకీ జీజీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, దినేష్ దివాకరన్ సినిమాటోగ్రఫీ ట్రైలర్లోని భయానక వాతావరణాన్ని మరింత బలంగా నిలబెడుతున్నాయి. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల కీలక పాత్రల్లో నటించారు. కథలోని తీవ్రత కారణంగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'A'సర్టిఫికెట్ జారీ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 23న పలు భాషల్లో విడుదల కానుంది. మరి 418 నంబర్ గది వెనుక దాగిన భయానక రహస్యం ప్రేక్షకులను ఎంతవరకు వణికిస్తుందో చూడాలి..
