Annayya Paanamlo Song: మాస్ హీరోలో ఈ ఎమోషనల్ యాంగిల్ చూశారా? 'భోగి' నుంచి అదిరిపోయే పాట రిలీజ్!

Annayya Paanamlo Song: మాస్ హీరోలో ఈ ఎమోషనల్ యాంగిల్ చూశారా? 'భోగి' నుంచి అదిరిపోయే పాట రిలీజ్!

మాస్ హీరోగా మరోసారి తన పవర్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు శర్వానంద్. ఈసారి యాక్షన్, ఎమోషన్, పక్కా రస్టిక్ టచ్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు 'భోగి' సినిమాతో వస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా 'అన్నయ్య పానం‌లో' సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీపై ఆసక్తి నెలకొనగా.. ఈ పాటతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించిన ఈ పాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

శ్రీకృష్ణ గాత్రంలో వినిపించిన ఈ ఎమోషనల్ నంబర్ మనసును తాకేలా సాగింది. బీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం పాటకు ప్రాణం పోయగా.. చంద్రబోస్ రాసిన సాహిత్యం కుటుంబ బంధాల్లోని ప్రేమను, ఆప్యాయతను అందంగా పలికించింది. కేవలం ఓ పాటలా కాకుండా.. సినిమాలోని భావోద్వేగ ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది.

విజువల్స్‌లో శర్వానంద్ తన సోదరీమణులతో పంచుకునే అనుబంధాన్ని ప్రత్యేకంగా చూపించారు. వారి పట్ల అతడికి ఉన్న ప్రేమ, బాధ్యత, ఆప్యాయత పాటలోని ప్రధాన భావాలుగా నిలిచాయి. మాస్ కథల్లో హీరోయిజం, ఫైట్లు ఎంత ముఖ్యమో.. కుటుంబ భావోద్వేగాలు కూడా అంతే బలంగా ఉంటాయని గుర్తుచేసేలా ఈ పాట సాగింది. ముఖ్యంగా పల్లెటూరి వాతావరణం, సహజమైన భావప్రకటనతో 'భోగి' ఆకట్టుకుంటోంది. మాస్ ఇమేజ్‌కు ఎమోషనల్ డెప్త్‌ను జోడిస్తూ శర్వానంద్ ఈ సినిమాలో కనిపించనున్నాడనే సంకేతాలు ఈ పాటతో బలపడుతున్నాయి. సంపత్ నంది తనదైన రస్టిక్ కథనంతో ఈ చిత్రాన్ని ఎలా మలిచారన్నది ఆసక్తికరంగా మారింది.

ALSO READ : 15 ఏళ్లుగా మూసి ఉన్న గది.. తెరిస్తే ప్రాణాలకే ప్రమాదం.. '

కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 12, 2026న విడుదల కానున్న 'భోగి'లో మాస్ ఎలివేషన్లతో పాటు కుటుంబ బంధాల భావోద్వేగాలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయా? అన్నది చూడాలి. 'అన్నయ్య పానం‌లో' మాత్రం సినిమాకు మంచి ఎమోషనల్ స్టార్ట్ ఇచ్చింది.