దసరా పండగ పూట హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బండ్లగూడ జాగీర్ లో బైకును లారీ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( అక్టోబర్ 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
బండ్లగూడ జాగీర్ లోని కాళీ మందిర్ ఆలయం సమీపంలో జరిగింది ఈ ఘటన. దుర్గామాత ఆలయానికి పూజ కోసం వచ్చిన లారీ అదుపుతప్పి బైకును ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.డాన్ బాస్కో చర్చిలో కార్యక్రమానికి వచ్చి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. పూజ సమయంలో లారీ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది . లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు పోలీసులు. ఈ ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
