నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏదో ఒక సమయంలో టీ సిప్ చేయకుండా ఉండలేము కదా. కనీసం రోజుకు నాలుగు కప్పుల చాయ్ పడకుంటే చాలా మందికి పొద్దు గడవదు. కొందరైతే నీళ్లు తాగినట్లు పొద్దంతా ఏదో ఒక వంకతో తాగుతూనే ఉంటారు. అలాంటి వారికి ఇది షాకింగ్ న్యూస్ . టీ పౌడర్ లో పురుగు మందుల అవశేషాలపై ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది.
తేయాకు తోటల్లో పురుగులు, కీటకాలు, చెదల నివారణ కోసం క్రిమిసంహార మందులను కొడుతుంటారు. దీని కోసం అసిటమైప్రిడ్, ఇమిడాక్లోప్రిడ్ వంటి పురుగుమందులను పిచికారీ చేస్తుంటారు. అయితే టీపౌడర్ గా చేసే క్రమంలో తేయాకును శుద్ధి చేసినప్పటికీ కొన్ని విషపూరిత అవశేషాలు ఉండిపోతాయి. ఇవి మోతాదుకు మించితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది.
ఎంత మోతాదులో ఉంటే సేఫ్:
టీపౌడర్లో ఉండే పురుగు మందుల అవశేషాలు ఎంత మోతాదులో ఉండాలి.. అంతకు మించితే పరిణామాలు ఏంటనే దానిపై FSSAI గైడ్ లైన్స్ విడుదల చేసింది. అసిటమైప్రిడ్ అవశేషాలు కిలోకు 20 మిల్లీగ్రామాలు (20పీపీఎం), ఇమిడాక్లోప్రిడ్ కిలోకు 50 మిల్లీ గ్రాములు (50 పీపీఎం) మించరాదని గరిష్ట అవశేష పరిమితి (Maximum Residue Limit - MRL) గురించి తెలిపింది.
MRL అంటే ఏమిటి?
MRL (Maximum Residue Limit ) అనేది ఒక ఆహార ఉత్పత్తిలో చట్టబద్ధంగా అనుమతించే గరిష్ట పురుగుమందుల అవశేషాల పరిమాణం. ఇటీవల దేశంలో 36 బ్లాక్ టీ శాంపుల్స్ పై జరిపిన పరీక్షలో, 28 నమూనాలలో 11 రకాల పురుగుమందులు గుర్తించారు. అయితే వాటి కచ్చిత పరిమాణం ఎంత అనేది వెల్లడించలేదు. అయితే కొన్ని కంపెనీలు లిమిట్ కు లోబడే టీపౌడర్ తయారు చేస్తున్నప్పటికీ.. FSSAI ప్రకారం ఇక నుంచి స్ట్రిక్ట్ గా ఫాలో కావాల్సి ఉంటుంది. వినియోగదారులు కూడా అవగాహన కలిగి ఉండటం మంచిది.
