ఏపీ ఎన్నికలు : నామినేషన్ల పూర్తయినా ఆగని దాడులు.. పొద్దుటూరు వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై రాళ్ల దాడి

ఏపీ ఎన్నికలు : నామినేషన్ల పూర్తయినా ఆగని దాడులు.. పొద్దుటూరు వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై రాళ్ల దాడి

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి దాటిన తర్వాత రాళ్ల దాడి జరిగింది. ఆయన ఇంటి ప్రాంగణంలో నిలిపి ఉంచిన కారుపై దుండగులు రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి.

పల్సర్ బైక్‌పై ముసుగులు ధరించి వచ్చిన  ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు నరసింహారెడ్డి ఇంటి ప్రాంగణంలోని  కారు అద్దాలను పగలగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు అక్కడి సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఇంటి గేట్లు మూసి ఉండటంతో లోపలికి ప్రవేశించలేక రాళ్లు రువ్వి అక్కడినుంచి వెళ్లిపోయారు.  

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహారెడ్డి అక్టోబర్ 17న నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకున్నారని ఆ పార్టీ వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలో తాజాగా నరసింహారెడ్డి ఇంటి వద్ద చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఈ దాడి వెనుక టీడీపీ శ్రేణుల ప్రమేయం ఉందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి ఉపయోగించిన వాహనం, నిందితుల గుర్తింపు, ఘటన వెనుక కారణాలను తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది.