సామాన్యుడి బడ్జెట్ తలకిందులు..బియ్యం నుంచి నూనెల దాకా చుక్కల్లో నిత్యవసర ధరలు

సామాన్యుడి బడ్జెట్ తలకిందులు..బియ్యం నుంచి నూనెల దాకా చుక్కల్లో నిత్యవసర ధరలు
  • హైదరాబాద్ ఐటీలో ఏఐ లేఆఫ్స్​ మంట..
  • ఊడుతున్న కొలువులు.. భారమైన ఈఎంఐలు
  • పల్లెల్లో కిరాణా సరుకులకూ క్రెడిట్ కార్డులు
  • లోన్​యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వలలో చిక్కుకొని జనం విలవిల
  • ఇండ్ల తాకట్టుతో ప్రైవేట్ ఫైనాన్స్ దోపిడీ
  • కిస్తీలు చెల్లించకపోతే ఇండ్ల జప్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. సంపాదనకు, ఖర్చులకు పొంతన లేకపోవడంతో నెలవారీ ఫ్యామిలీ బడ్జెట్​ పూర్తిగా తలకిందులయింది. గత 3 నెలల కాలంలోనే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వంటింటి ఖర్చులు మోయలేని భారంగా మారాయి. పైసా పొదుపు చేసుకునే అవకాశం లేకపోవడంతో అత్యవసర ఖర్చుల కోసం ప్రజలు అప్పుల బాటపడుతున్నారు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) ఇటీవలి గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో క్రెడిట్-డిపాజిట్ (సీడీ) నిష్పత్తి 128.58 శాతానికి చేరింది. అంటే ప్రజలు బ్యాంకుల్లో దాచుకుంటున్న డిపాజిట్ల కంటే తీసుకుంటున్న రుణాల పరిమాణమే ఎక్కువగా ఉంది. అటు నగరాల్లో ఏఐ ప్రభావంతో ఐటీ ఉద్యోగాలు ఊడుతుంటే.. ఇటు పల్లెల్లో నిత్యావసరాలు కొనడానికే అప్పులు చేయాల్సి వస్తున్నది. పట్టణాల నుంచి గ్రామాల దాకా క్రెడిట్ కార్డులు, లోన్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సంస్కృతి విస్తరించి జనం రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు.


మూడు నెలల కిందట ఉన్న ధరలతో పోలిస్తే  ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర సరుకుల రేట్లు భారీగా పెరిగాయి. జులైలో కిలో రూ. 52 నుంచి రూ. 55 పలికిన సాధారణ సోనా మసూరి బియ్యం ధర ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో రూ. 68 నుంచి రూ. 75 వరకు ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యతరగతి ఎక్కువగా కొనుగోలు చేసే 25 కిలోల సన్న బియ్యం బస్తా ధర జులైలో రూ. 1,350 ఉండగా, ఇప్పుడు రూ. 1,850కి చేరింది. వంటింట్లో ప్రధానమైన కందిపప్పు ధర జులైలో కిలో రూ. 145 ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో రూ. 175 నుంచి రూ. 180కి ఎగబాకింది. వంట నూనెల విషయానికి వస్తే లీటర్ పామాయిల్ రూ.110 నుంచి రూ. 140కి, సన్‌‌‌‌ఫ్లవర్ ఆయిల్ రూ. 132 నుంచి రూ. 168కి పెరిగింది. చింతపండు కిలో రూ.160 నుంచి రూ.220కి, ఎండుమిర్చి రూ. 240 నుంచి రూ. 310కి చేరి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లిగడ్డలు, టమాటాతోసహా కూరగాయల ధరలు సైతం తగ్గకపోవడంతో కిచెన్ బడ్జెట్ పూర్తిగా పెరిగిపోయింది. ఒక సాధారణ కుటుంబానికి నెలవారీ సరుకుల బిల్లుపై అదనంగా రూ. 5 వేల నుంచి రూ. 8 వేల వరకు భారం పడుతున్నది.

పడిపోతున్న కుటుంబాల  జీవన ప్రమాణాలు..

ఆదాయం పెరగకపోగా కిచెన్ ఖర్చులు భారీగా పెరగడంతో కుటుంబాల జీవన ప్రమాణాలు (క్వాలిటీ లైఫ్) దారుణంగా పడిపోయాయి. నెలాఖరుకు డబ్బులు సరిపోకపోవడంతో చాలా కుటుంబాలు పౌష్టికాహార కొనుగోళ్లను తగ్గించుకుంటున్నాయి. పాలు, పండ్లు, గుడ్లు, నాన్-వెజ్ వినియోగాన్ని సగానికిపైగా తగ్గించి కేవలం పూట గడిచే ఆహారంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇది పిల్లల ఎదుగుదలపై, కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఆసుపత్రులకు వెళ్లకుండా మెడికల్ షాపుల్లో మాత్రలు తెచ్చుకొని నెట్టుకొస్తున్నారు. పిల్లల పాఠశాల ఫీజులు, పుస్తకాల ఖర్చులను సమకూర్చుకోలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని 1.33 కోట్ల పీఎంజేడీవై ఖాతాల్లో ఏకంగా 19.13 లక్షల ఖాతాలు జీరో బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్నట్టు ఎస్ఎల్బీసీ నివేదిక వెల్లడించింది. సేవింగ్స్ ఖాతాల్లో నిల్వలు పూర్తిగా కరిగిపోవడంతో నెలవారీ ఖర్చుల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టే వారి సంఖ్య పెరిగింది. పొదుపు శూన్యమై, ఖర్చులు పెరగడంతో కుటుంబాల్లో ఆర్థిక అభద్రత, మానసిక ఒత్తిడి తీవ్రమవుతున్నది. 

ఏఐ ఎఫెక్ట్​.. ఉద్యోగాలు ఊస్ట్‌‌‌‌

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ రాకతో హైదరాబాద్ ఐటీ కారిడార్‌‌‌‌లో  సాఫ్ట్‌‌‌‌వేర్ ఉద్యోగాల కోత మొదలైంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీల్లోని పలు ఐటీ సంస్థలు ఆటోమేషన్ ప్రక్రియను వేగవంతం చేసి.. ఉద్యోగులను తొలగిస్తున్నాయి. బేసిక్ కోడింగ్, సాఫ్ట్‌‌‌‌వేర్ టెస్టింగ్, కస్టమర్ సపోర్ట్, కంటెంట్ విభాగాల్లో పనిచేస్తున్న వందలాది మంది టెకీలు కొలువులు కోల్పోయారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్ మందగించడంతో ఉద్యోగాలు పోయిన వారికి కొత్త అవకాశాలు రావడం కష్టంగా మారింది. ఉద్యోగాల్లో ఉన్నవారికి సైతం వార్షిక వేతనాల పెంపు (హైక్స్) నిలిచిపోవడంతోపాటు పనిభారం రెట్టింపైంది. హైదరాబాద్‌‌‌‌లో పెరిగిన ఫ్లాట్ల అద్దెలు, మరోవైపు రూ. 40 వేల నుంచి రూ. 80 వేల వరకు ఉన్న హోమ్ లోన్ ఈఎంఐలు టెకీలకు గుదిబండగా మారాయి. చేతిలో జీతాలు లేక, క్రెడిట్ కార్డుల బిల్లులు, కార్ లోన్ల కిస్తీలు చెల్లించలేక వారు డిప్రెషన్‌‌‌‌కు గురవుతున్నారు. ఎస్ఎల్బీసీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో నాన్-ప్రయారిటీ పర్సనల్ లోన్లు రూ. 93,459 కోట్లకు చేరడం టెకీల రుణభారాన్ని సూచిస్తున్నది. ఒకప్పుడు విలాసవంతమైన జీవితం గడిపిన సాఫ్ట్‌‌‌‌వేర్ ఉద్యోగులు ఇప్పుడు నిత్యావసరాల ఖర్చులకే తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇండ్లు తాకట్టు పెట్టి..

గ్రామాల్లో అత్యవసర ఖర్చుల కోసం ప్రజలు ప్రైవేట్ ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలు, ఫైనాన్స్ కంపెనీల వద్ద ఇండ్ల పత్రాలను తాకట్టు పెడుతున్నారు. ఆదాయ ఆధారాలు అడగకుండా కేవలం ఇంటి దస్తావేజులు చూసి ‘లోన్ అగైనెస్ట్‌‌‌‌ ప్రాపర్టీ’ పేరుతో రుణాలు ఇస్తుండటంతో జనం ఆకర్షితులవుతున్నారు. అయితే, ఈ రుణాలపై ప్రైవేట్ సంస్థలు వసూలు చేసే చక్రవడ్డీలు, అదనపు రుసుములతో అసలు కంటే వడ్డీలే భారమవుతున్నాయి. సకాలంలో కిస్తీలు చెల్లించకపోతే ఇండ్లను జప్తు చేస్తామని ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఒత్తిడి తెస్తున్నారు. తీసుకున్న అప్పులు తీర్చలేక గ్రామాల్లో కొందరు తమ సొంత ఇండ్లను ఫైనాన్స్ కంపెనీలకు అప్పగించాల్సి వస్తున్నది. ఎస్ఎల్బీసీ డేటా ప్రకారం మహబూబాబాద్‌‌‌‌లో సీడీ నిష్పత్తి 265.59 శాతం, సూర్యాపేటలో 263.66 శాతం, జనగాంలో 260.21 శాతంగా నమోదైంది. అలాగే, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌లో 231.29 శాతం, జోగులాంబ గద్వాలలో 227.60 శాతం మేర సీడీ నిష్పత్తి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నాన్-ప్రయారిటీ సెక్టార్ కింద ఇతర వినియోగ రుణాలు రూ. 5.33 లక్షల కోట్లకు చేరడం ఆస్తుల తాకట్టు తీవ్రతను తెలుపుతున్నది.

పల్లెల్లోనూ సంక్షోభం


ఈ సంక్షోభం పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెల్లోనూ తీవ్ర స్థాయికి చేరింది. వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగి, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గ్రామీణ ప్రజల వద్ద నగదు కొరత ఏర్పడింది. దీంతో నిత్యావసర సరుకులు, పిల్లల ఖర్చులు, వైద్య అవసరాల కోసం గ్రామాల్లో క్రెడిట్ కార్డులు, లోన్ యాప్‌‌‌‌లను ఆశ్రయిస్తు న్నారు. బ్యాంకుల్లో రుణాలు దొరకడంలో జాప్యం జరుగుతుండటంతో ఆన్‌‌‌‌లైన్ ఇన్‌‌‌‌స్టాంట్ లోన్ యాప్‌‌‌‌ల ఉచ్చులో పడుతున్నారు. కేవలం ఆధార్, పాన్ కార్డుల ఆధారంగా నిమిషాల్లో అప్పులిచ్చే ఈ యాప్‌‌‌‌లు 36 నుంచి 60 శాతం వరకు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. గడువు దాటితే కాంటాక్ట్ లిస్ట్‌‌‌‌లోని వారికీమెసేజ్‌‌‌‌లు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. పల్లెల్లోని కిరాణా దుకాణాల్లోనూ ఉద్దెర ఖాతాలు పెరిగిపోయి చిరు వ్యాపారులు సైతం సరుకులు తీసుకురాలేకపోతున్నారు. డ్వాక్రా సభ్యులు తీసుకున్న రుణాలు వ్యాపారాలకు కాకుండా రోజువారీ ఖర్చులకే వినియోగమవుతున్నాయి. పూట గడవడం కోసం చేసే ఈ డిజిటల్ అప్పులు గ్రామీణులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి.