గోదావరి పుష్కరాల నాటికి ఆలయాల పనులు పూర్తి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గోదావరి పుష్కరాల నాటికి ఆలయాల పనులు పూర్తి  : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •     ఆలయాల అభివృద్ధికి రూ.2 వేల కోట్లు
  •     డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

తల్లాడ, వెలుగు: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గోదావరి పుష్కరాల నాటికి  నదీపరీవాహక ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏన్కురు నుంచి  నాచారం వరకు రూ.44 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు ఆయన ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భద్రాచల సీతారాముల దేవస్థానానికి రూ. 276 కోట్లు, బాసర సరస్వతీ దేవాలయానికి  రూ. 354 కోట్లు కేటాయించామన్నారు. పుష్కరాల నాటికి అన్ని ఆలయాల అభివృద్ధి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో కోటి 6 లక్షల కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక  ప్రభుత్వం తమదేనని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.10 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించిందన్నారు. మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో  8 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్​ఫాస్ట్​అందిస్తున్నామన్నారు. 

ఎల్​నినో కారణంగా వచ్చే ఏడాది జులై వరకు నీటికొరత ఉండనుందని,  ప్రజలు, రైతులు నీటిని  పొదుపుగా వాడుకోవాలని కోరారు. నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ బీమా పథకాన్ని   ప్రారంభించనున్నట్టు చెప్పారు. అనంతరం రూ. 3.38 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కును స్వయం సహాయక సంఘాలకు  భట్టి అందజేశారు. అంతకుముందు డిప్యూటీ సీఎం అద్భుత వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర, సీపీ సునీల్ దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.