- జలమండలి ఎండీ
హైదరాబాద్ సిటీ, వెలుగు : నగర పరిధిలోని అన్ని ప్రైవేట్ మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీలు) యాజమాన్యాలు ఈ నెల 25లోగా తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జలమండలి ఎండీ కె అశోక్‌రెడ్డి సూచించారు. జలమండలి పరిధిలో 600 ప్రైవేట్ ఎస్టీపీలుండగా, ఇప్పటివరకు 61 మాత్రమే నమోదు చేసుకున్నాయన్నారు. మిగతా యాజమాన్యాలు గడువులోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, దవాఖానలు, విద్యాసంస్థలు, పరిశ్రమల్లో ఎస్టీపీల తప్పనిసరి నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఎస్టీపీల కెపాసిటీ, రోజువారీ శుద్ధి చేస్తున్న మురుగునీటి పరిమాణం, శుద్ధి చేసిన నీటి వినియోగం, మిగులు నీటి లభ్యత వివరాలను సేకరించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. రానున్న వేసవిలో తాగునీటి అవసరాలు పెరిగే అవకాశం ఉన్నందున నిర్మాణ రంగం, పరిశ్రమలు, ఉద్యానవనాల నిర్వహణకు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రైవేట్ ఎస్టీపీల్లో మిగులుగా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. యాజమాన్యాలు జలమండలి వెబ్‌సైట్ https://www.hyderabadwater.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.
