19 ఏళ్ల యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్.. న‌మ‌న్ ధీర్ సరికొత్త చరిత్ర 

19 ఏళ్ల యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్.. న‌మ‌న్ ధీర్ సరికొత్త చరిత్ర 

Naman Dhir: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినప్పటికీ, ఇండియన్ యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్ (Naman Dhir) విధ్వంసకర బ్యాటింగ్‌తో తన పేరును క్రికెట్ చరిత్ర పుస్తకాల్లో లిఖించుకున్నాడు. వర్షం కారణంగా 9 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో, 7వ ఓవర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన నమన్ ధీర్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 6 బంతుల్లో 3 భారీ సిక్సర్లు, 1 ఫోర్‌తో 24 పరుగులు* సాధించి 400 స్ట్రైక్ రేట్‌తో నాటౌట్‌గా నిలిచాడు.

యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు: 

నమన్ ధీర్ ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో (T20Is) కనీసం 5 బంతులు ఎదుర్కొన్న భారత బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ (400 SR) నమోదు చేసిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. దీంతో 2007 టీ20 ప్రపంచ కప్‌లో డర్బన్ వేదికగా ఇంగ్లాండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో 6 సిక్సర్లు బాది 362.50 స్ట్రైక్ రేట్ సాధించిన దిగ్గజం యువరాజ్ సింగ్ (58 నాటౌట్ - 16 బంతుల్లో) పేరు మీద ఉన్న 19 ఏళ్ల రికార్డు బ్రేక్ అయింది. 

భారత్ తరఫున అత్యుత్తమ స్ట్రైక్ రేట్: 

బ్యాటర్      స్కోరు (రన్స్/బాల్స్)              స్ట్రైక్ రేట్ (SR)           ప్రత్యర్థి    వేదిక                    సంవత్సరం
నమన్ ధీర్                24 (6)*                          400.00                    వెస్టిండీస్           బెంగళూరు                   2026
యువరాజ్ సింగ్     58 (16)                           362.50                     ఇంగ్లాండ్             డర్బన్                        2007
దినేష్ కార్తీక్              29* (8)                          362.50                     బంగ్లాదేశ్            కొలంబో                       2018
హార్దిక్ పాండ్యా          32 (9)                            355.55                     ఐర్లాండ్                డబ్లిన్                         2018
రింకూ సింగ్               31 (9)                          344.44                     ఆస్ట్రేలియా      తిరువనంతపురం         2023

ప్రపంచ రికార్డులో హ్యారీ బ్రూక్ సరసన: 

అంతర్జాతీయ టీ20 చరిత్రలో టెస్టు ఆడే దేశాల తరఫున కనీసం 6 బంతులు ఎదుర్కొని 400+ అంతకంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఇన్నింగ్స్ ముగించిన రెండో బ్యాటర్‌గా నమన్ ధీర్ నిలిచాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ (2023లో విండీస్‌పై 7 బంతుల్లో 31* పరుగులు - 442.85 SR) తొలి స్థానంలో ఉన్నాడు.