నగోయా: పారా ఆసియా గేమ్స్‌కు ఇండియా అథ్లెట్లు రెడీ అయ్యారు. నేటి నుంచి జరిగే పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయయారు. అయితే గత గేమ్స్‌లో సాధించిన 111 పతకాలను ఈసారి అధిగమిస్తారా? లేదా? అన్నది సవాల్‌గా మారింది. 2023 హాంగ్జౌ గేమ్స్‌లో ఇండియా 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలతో ఐదో ప్లేస్‌లో నిలిచింది. అప్పుడు 303 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు.
కానీ ఇప్పటి గేమ్స్‌కు వచ్చేసరికి అథ్లెట్ల సంఖ్య భారీగా తగ్గింది. 11 విభాగాల్లో 168 మంది అథ్లెట్లు మాత్రమే పోటీలో ఉన్నారు. పార్టిసిపేషన్ కోటా లేకపోవడం, ఆఫర్ ఈవెంట్లను తగ్గించడంతో అథ్లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇప్పటికే పారా బ్యాడ్మింటన్, పారా టేబుల్ టెన్నిస్, బోకియా, బ్లైండ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఇందులో ఇండియా ప్లేయర్లు మంచి ఫలితాలనే రాబట్టారు. ఎఫ్–64 జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు త్రోయర్ సుమిత్ అంటిల్పై భారీ ఆశలు ఉన్నాయి. హై జంపర్ నిషాద్ కుమార్, విమెన్స్ 100, 200 మీటర్లలో పోటీపడుతున్న ప్రీతి పాల్, క్లబ్ త్రోయర్ ధరంభీర్ సింగ్ కూడా పతకం రేసులో ఉన్నారు.
పారా ఆర్చర్ శీతల్ దేవి కాంపౌండ్ విభాగంలో కచ్చితంగా స్వర్ణం గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. రికర్వ్‌లో హర్విందర్ సింగ్, తొమన్ కుమార్ కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ఆదివారం జరిగే ఓపెనింగ్ సెర్మనీలో పారా షట్లర్ ప్రమోద్ భగత్ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణం గెలిచిన అవనీ లేఖర షూటింగ్ టీమ్‌కు సారథ్యం వహించనుంది.
టేబుల్ టెన్నిస్‌లో భవీనా పటేల్ పతకం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. పారా షూటింగ్, పారా సైక్లింగ్‌లో క్రీడాకారుల ఎంపిక వివాదానికి దారి తీసినా.. గేమ్స్ వరకు అన్ని సర్దుకుంటాయని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) ప్రెసిడెంట్ దేవేంద్ర జజారియా అన్నాడు. పూర్తి మెరిట్‌పైనే ప్లేయర్ల ఎంపిక జరిగిందని స్పష్టం చేశాడు. పారా అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌లో ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది. షూటింగ్, టీటీలో వచ్చే పతకాలు పట్టికలో ఇండియాను పై స్థానంలో నిలపడంలో కీలక పాత్ర పోషించవచ్చు.
బ్యాడ్మింటన్‌లో పతకం ఖాయం
పారా ఆసియా గేమ్స్‌లో ఇండియాకు తొలి పతకం ఖాయమైంది. శనివారం జరిగిన పారా బ్యాడ్మింటన్ విమెన్స్ డబుల్స్ ఎస్ఎల్3-----ఎస్‌యూ5 క్వార్టర్ఫైనల్లో మానసి జోషి–తులసిమతి మురుగేశన్ జోడీ 21–10, 21–17తో యుమేమ్ లియు–టోంగ్టోంగ్ లీ (చైనా)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. దాంతో కనీసం కాంస్య పతకం ఖరారైంది. మెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6 గ్రూప్ మ్యాచ్‌లో కృష్ణ నగర్ 21–13, 21–15తో సుభాన్ (ఇండోనేసియా)పై గెలిచి క్వార్టర్లోకి ప్రవేశించాడు. ఇతర మ్యాచ్‌ల్లో నితేష్ 21–6, 21–7తో నత్తపోల్ చమ్నన్వైట్ (థాయ్‌లాండ్)పై, భగత్ 21–17, 21–16తో జియాంగ్ లిచువాన్ (చైనా)పై గెలిచారు.
