- గ్రేటర్ వరంగల్లో రెండుచోట్ల వైభవంగా బతుకమ్మ సంబురాలు
- గ్రేటర్ సిటీ ట్రాఫిక్ ఆంక్షలు
వరంగల్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ సంబురాలకు ఓరుగల్లు ముస్తాబైంది. తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో భాగంగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హనుమకొండలోని వెయ్యిస్తంభాల గుడిలో ప్రారంభమయ్యాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలకు కేరాఫ్గా భావించే పద్మాక్షి ఆలయ ప్రాంతం వేలాది మంది మహిళల రాకతో పూలవనంగా మారనుంది. దీంతో బల్దియా ఆఫీసర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
జిగేల్మనేలా.. పద్మాక్షిగుట్ట, ఉర్సుగుట్ట
గ్రేటర్ వరంగల్లో సద్దుల బతుకమ్మ సంబురాలు ఏటేటా విస్తరిస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో చివరి రోజు బతుకమ్మ వేడుకలకు హనుమకొండ నడిబొడ్డున ఉన్న పద్మాక్షిగుట్ట నీటి గుండం ప్రాంతం ప్రధాన వేదికగా నిలుస్తోంది. హనుమకొండ చౌరస్తా నుంచి హంటర్ రోడ్డులోని శాయంపేట వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేస్తారు. హనుమకొండకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ ప్రాంతంలోని ఉర్సుగుట్ట సైతం వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ రెండు ప్రాంతాలను కలర్ఫుల్ లైటింగ్తో జిగేల్మనేలా రెడీ చేస్తున్నారు.
గ్రేటర్లో 20 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు..
గ్రేటర్ వరంగల్ పరిధిలోని హనుమకొండలో హసన్పర్తి, చింతగట్టు, అబ్బసాయికుంట, భీమారం, గోపాల్పూర్, కాజీపేట పరిధిలోని వడ్డేపల్లి, సోమిడి, బంధం చెరువు, వరంగల్ ప్రాంతంలోని ఉర్సు, బెస్తం చెరువు, మెట్టు దర్వాజ, శివనగర్, కట్టమల్లన్న, సొసైటీ కాలనీ, కాశీబుగ్గ, పద్మనగర్, చిన్న వడ్డేపల్లి, తోటమైదానం, భద్రకాళి చెరువు తదితర ప్రాంతాల్లో బతుకమ్మ ఆటపాటలు, నిమజ్జనాల కోసం గ్రేటర్ కార్పొరేషన్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా సుమారు 20 ప్రాంతాల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు.
సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు..
లక్షలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చే నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత బందోబస్తు ఏర్పాట్లపై ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి హనుమకొండలోని కాంగ్రెస్ భవన్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలను పెద్దమ్మగడ్డ మార్గంలోకి మళ్లించనున్నారు. కరీంనగర్ నుంచి హనుమకొండ మీదుగా ఖమ్మం వెళ్లే వెహికల్స్ కాకతీయ యూనివర్సిటీ, పెద్దమ్మగడ్డ, హనుమాన్ జంక్షన్, పోచమ్మమైదాన్ మీదుగా సిటీ దాటాల్సి ఉంటుంది. వరంగల్లోని ఉర్సుగుట్ట ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి హనుమకొండ, కాజీపేట మీదుగా ఖమ్మం వైపు వెళ్లేవారు సిటీలోకి రాకుండా కరుణాపురం, వెంకటాపూర్, ఐనవోలు, పున్నేలు మీదుగా ఖమ్మం హైవేకి వెళ్లాల్సి ఉంది.
