తహసీల్దార్ ఆఫీస్ లో రైతుల ఆత్మహత్యాయత్నం

తహసీల్దార్ ఆఫీస్ లో రైతుల ఆత్మహత్యాయత్నం
  •     అడ్డుకున్న పోలీసులు
  •     అక్రమ రిజిస్ట్రేషన్​ఆపాలని డిమాండ్​
  •     వికారాబాద్​ జిల్లా కోటపల్లి తహసీల్దార్ ఆఫీస్​వద్ద ఘటన 

తాండూరు, వెలుగు : వికారాబాద్‌‌ జిల్లా కోటపల్లి మండల తహసీల్దార్‌‌ ఆఫీస్​లో శనివారం అక్రమ రిజిస్ట్రేషన్‌‌ను ఆపాలని ముగ్గురు రైతులు డీజిల్‌‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మండలంలోని బార్వాద్‌‌ గ్రామానికి చెందిన బేగరి అరవింద్‌‌, బేగరి నర్సింలు, బేగరి మోహన్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని సర్వే నంబర్‌‌ 131లో తమ తాతల నుంచి సంక్రమించిన 12 ఎకరాల భూమి ఉందని, అందులో నాలుగు వాటాలు ఉన్నాయని, అయితే, ఆ భూమిలో ఆరు ఎకరాలను ఒక్కరికే అక్రమంగా రిజిస్ట్రేషన్‌‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

భూమిలోకి వెళ్లకుండా పోలీసులు తమపై బైండోవర్‌‌ కేసులు నమోదు చేశారని చెప్పారు. భూమి వివాదంపై కోర్టును ఆశ్రయించినా, సంబంధిత పత్రాలు చూపించినా ఆఫీసర్లు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన మూడు ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌‌ చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ తహసీల్దార్‌‌ కార్యాలయం వద్ద డీజిల్‌‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు వారి వద్ద నుంచి డీజిల్‌‌ బాటిల్‌‌ను తీసుకుని అడ్డుకున్నారు. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన భూమిని ఇప్పించి న్యాయం చేయాలని రైతులు అధికారులను కోరారు.