నితీశ్ కోసం 9 హత్యలు చేయించా.. ఎమ్మెల్యే అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

నితీశ్ కోసం 9 హత్యలు చేయించా.. ఎమ్మెల్యే అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

 

  • బిహార్​లో రాజకీయ దుమారం
  • పార్టీకి సంబంధంలేదన్న జేడీయూ
  • మాటమార్చి లాలూ ప్రసాద్​ యాదవ్​పై ఆరోపణలు చేసిన అనంత్​ సింగ్

పాట్నా: మాజీ సీఎం నితీశ్ కుమార్ కోసం ‘9 హత్యలు చేయించా’ అంటూ జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ చేసిన కామెంట్లు బిహార్ పాలిటిక్స్‌‌‌‌‌‌‌‌లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వివాదంపై జేడీయూ పార్టీ వెంటనే స్పందించి తమకేం సంబంధంలేదని ప్రకటించగా.. అనంత్ సింగ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. మొకామా ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్, రాబోయే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థి నీరజ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు పార్టీ టికెట్ కేటాయించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో ఈ నెల16న తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన నితీశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నితీశ్ తో నాకు చాలాకాలంగా మంచి సంబంధాలున్నాయి. ఆయనకు సాయం చేయడానికి నేను 9 మందిని హత్య చేయించాను. రాజకీయంగా బలపడేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో నేను అండగా నిలిచాను’ అంటూ అనంత్ సింగ్ పేర్కొన్నారు. 

దీనిపై లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ సీరియస్ అయ్యింది. ఈ మర్డర్ల వెనుక అసలు నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేసింది. జేడీయూ మిత్రపక్షమైన హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) చీఫ్, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఎవరికైనా మంచి పనులతో మద్దతు ఇవ్వాలి తప్ప, నేరాల ద్వారా కాదని.. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఆర్జేడీ లక్ష్యంగా విమర్శలు

ఈ వివాదం ముదిరిపోవడంతో జేడీయూ పార్టీ అనంత్ సింగ్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. నితీశ్ తన 50 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేర రాజకీయాలకు తావివ్వలేదని జేడీయూ నేత రాజీవ్ రంజన్ ప్రసాద్ పేర్కొన్నారు. మరోవైపు, అనంత్ సింగ్ కూడా తన కామెంట్లను వెనక్కి తీసుకున్నారు. ఆర్జేడీ హయాంలో బిహార్‌‌‌‌‌‌‌‌లో లా అండ్​ఆర్డర్​పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. 

‘నేను నీరజ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు రిప్లై ఇస్తూ, గతంలో నేను చేసిన త్యాగాల గురించి చెప్పాను. లాలూ ప్రభుత్వ హయాంలో నా అనుచరులు 9 మంది హత్యకు గురయ్యారు, నాపై కూడా కాల్పులు జరిగాయి. మేము నితీశ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా నిలిచామనే లాలూ యాదవ్ వారిని హత్య చేయించారు’ అని అనంత్​సింగ్ వివరణ ఇచ్చారు.