- గ్రేటర్ నోయిడాలో తీవ్ర కలకలం
- కన్నతల్లిపైనే స్థానికుల అనుమానం
- ఆస్తి తగాదాలే కారణమని ఆరోపణలు
- గ్రేటర్ నోయిడాలో తీవ్ర కలకలం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా పరిధిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. నూడుల్స్ తిని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకం రేపింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. శుక్రవారం రాత్రి వీరు తిన్న నూడుల్స్ విషపూరితం కావడంవల్లే మరణించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. గ్రేటర్ నోయిడాలోని రబుపురా పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. మృతులను మహేశ్ (37), ఆయన భార్య లలిత (35), వారి పిల్లలు లడ్డు (11), మిష్టి (7), సాక్షాత్ (3)గా గుర్తించారు.
శుక్రవారం రాత్రి వీరంతా నూడుల్స్ తిని నిద్రపోయారని స్థానికులు తెలిపారు. అయితే, శనివారం ఉదయం ఎంతకీ తలుపులు తెరువకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ ఫలితాలు వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణాలు తెలుస్తాయని స్పష్టంచేశారు. కాగా, ‘‘రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య కుటుంబ సభ్యులు నూడుల్స్ తిన్నారు. శనివారం ఉదయం ఒక చిన్నారికి స్కూల్లో పరీక్ష ఉంది. అయినప్పటికీ ఆ ఇంట్లో వాళ్లు లేవకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో ఈ మరణాలు వెలుగులోకి వచ్చాయి. వారు తిన్న ఫుడ్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నాం. రిపోర్ట్ వచ్చిన తర్వాతే నిజాలు బయటపడతాయి” పోలీసులు చెప్పారు.
ఆస్తి కోసం కన్నతల్లే..
కుటుంబంలోని అందరూ ఒకేరోజు మరణించడంపై స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ తల్లి ఆ ఇంటిని కూతురి పేర ట్రాన్స్ఫర్ చేశారని, దాన్ని ఖాళీ చేయాలని కొడుకు, కోడలిని నిత్యం వేధించేవారని ఆరోపిస్తున్నారు. ఆ ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని వెల్లడించారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లొచ్చిన తర్వాత మహేశ్ తల్లి స్వయంగా నూడిల్స్ వండి వారికి పెట్టిందని వివరించారు. కుటుంబంలో ఆస్తి తగాదాలున్న నేపథ్యంలో, పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు.
