తాగు నీటికే ఫస్ట్ ప్రయారిటీ: మంత్రి సీతక్క

తాగు నీటికే ఫస్ట్ ప్రయారిటీ: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌‌‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తాగునీటికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. రానున్న వేసవిలో రాష్ట్ర ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఆమె ఎర్రమంజిల్‌‌‌‌లోని గ్రామీణ తాగునీటి సరఫరా ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు.

రిజర్వాయర్ల వారీగా నీటి నిల్వలు, రానున్న వేసవిలో ఎదురయ్యే సవాళ్లు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. నవంబర్ 1వ తేదీ నాటికి సాగునీటి అవసరాలు తీరిన వెంటనే రిజర్వాయర్లలో అందుబాటులో ఉండే నీటిని పూర్తిస్థాయిలో తాగునీటి అవసరాలకే కేటాయించేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. రిజర్వాయర్లలో నీటిమట్టాలు డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోయినా సరఫరా ఆగకుండా కనీసం 100 ఎమర్జెన్సీ పంపులను ఇప్పటినుంచే సిద్ధంగా ఉంచాలని చెప్పారు.

పనిచేయని పంపులకు తక్షణమే మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి హ్యాబిటేషన్ ను యూనిట్‌‌‌‌గా తీసుకుని సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.