- నిధుల దుర్వినియోగం, నకిలీ బిల్లులకు చెక్.. వేగంగా ఉద్యోగుల సేవలు
- జీవోలు 139, 141 జారీ చేసిన సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల్లో జాప్యానికి తెరదించుతూ, ప్రభుత్వ శాఖల ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం డిజిటల్ పాలనలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఐఎస్) పోర్టల్‌లో భాగంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈ-హెచ్ఆర్ఎంఎస్), ఈ-శాంక్షన్ మాడ్యూళ్లను రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ తరఫున శనివారం వేర్వేరుగా 2 కీలక ఉత్తర్వులను సీఎస్ సంజయ్ జాజు జారీ చేశారు. ఉద్యోగుల సర్వీస్ రికార్డులను కాగితాల రూపంలో నిర్వహించడం వల్ల తలెత్తుతున్న సమస్యలను నివారించడంతో పాటు, నిధుల మంజూరులో పారదర్శకత తీసుకురావడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పర్యవేక్షకురాలిగా సిక్తా పట్నాయక్
మరోవైపు ప్రభుత్వ శాఖల్లో ఆర్థిక క్రమశిక్షణను కాపాడేందుకు ‘ఈ-శాంక్షన్’ మాడ్యూల్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గతంలో పనుల సంబంధిత అనుమతులు మినహా మిగిలిన అన్ని రకాల ప్రభుత్వ మంజూరు ఉత్తర్వులు వేర్వేరు ఫార్మాట్లలో మాన్యువల్‌గా జారీ కావడంతో ఆర్థిక శాఖ వద్ద సమగ్ర డేటాబేస్ ఉండేది కాదు. దీనివల్ల ఒకే శాంక్షన్పై ఒకటి కంటే ఎక్కువ బిల్లులు క్లెయిమ్ చేయడం, మంజూరైన పరిమితికి మించి అదనంగా ఖర్చు చేయడం, బిల్లులు ట్రెజరీకి వచ్చేంత వరకు సర్కారుపై పడే ఆర్థిక భారం తెలియకపోవడం వంటి తీవ్ర లోపాలు బయటపడ్డాయి.
ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇకపై వర్క్స్ మినహా మిగిలిన అన్ని పరిపాలనా మంజూరీలను కేవలం ఐఎఫ్ఎంఐఎస్ ఈ శాంక్షన్స్తోనే ఆన్లైన్లో జారీ చేయాలని స్పష్టం చేశారు. మంజూరైన ఆర్డర్ నేరుగా సంబంధిత డీడీవో లాగిన్‌కు చేరి, అక్కడి నుంచే బిల్లు ప్రిపరేషన్‌కు లింక్ అవుతుంది. తద్వారా శాంక్షన్–బిల్లు–పేమెంట్ ప్రక్రియలన్నీ ఒకే సాంకేతిక గొలుసుకట్టుగా మారి నకిలీ క్లెయిమ్‌లకు చెక్ పడనుంది.
ఈ డిజిటల్ సంస్కరణల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ కు ప్రభుత్వం అప్పగించింది. జిల్లాల వారీగా డీడీవోలు, అధికారులకు సాంకేతిక సహాయం అందించేందుకు ట్రెజరీలు, వర్క్స్ పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల పరిధిలో నోడల్ ఆఫీసర్లను నియమిస్తూ అధికారిక జాబితాను విడుదల చేశారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సాంకేతిక సమస్యల కోసం ఐఎఫ్ఎంఐఎస్ హెల్ప్‌లైన్ (+91-7042420033)తో పాటు టీమ్ మేనేజర్లు అక్షయ్ కుమార్ 7075057210, కళ్యాణ్ (9052502008)లను సంప్రదించవచ్చని సూచించారు.
ఇప్పటికే డీటీవోలు, పీఏవోలు, ఎస్టీవోలు, డీడీవోలకు సమగ్ర శిక్షణ పూర్తి చేయడంతో పాటు యూజర్ మాన్యువల్స్, వీడియో ట్యుటోరియల్స్‌ను పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం నిర్దేశించిన ఈ కొత్త వ్యవస్థలను అన్ని శాఖలు తక్షణమే అమలు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
డేటా కచ్చితత్వానికి డీడీవోలదే బాధ్యత
ఉద్యోగుల సమగ్ర సర్వీసు వివరాల కోసం రూపొందించిన ‘ఈ-హెచ్ఆర్ఎంఎస్’ ద్వారా ఇకపై డిజిటల్ సర్వీస్ రిజిస్టర్లు (డీఎస్ఆర్) అందుబాటులోకి రానున్నాయి. సచివాలయ విభాగాలు, శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా, క్షేత్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో డిజిటలైజ్ చేయనున్నారు. ఉద్యోగుల సెలవులు, వార్షిక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, బదిలీలు, వార్షిక పనితీరు నివేదికలు (ఏసీఆర్/ఏపీఏఆర్), స్థిరాస్తుల రిటర్న్స్ (ఐపీఆర్), విజిలెన్స్ కేసులు, పదవీ విరమణతో పాటు పెన్షన్ వ్యవహారాలన్నీ ఇకపై పూర్తిస్థాయిలో ఆన్లైన్ వర్క్‌ఫ్లో ద్వారానే పరిష్కారం కానున్నాయి.
ఆన్లైన్లో నమోదు చేసే డేటా కచ్చితత్వం, ప్రామాణికతకు సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డీడీవోలు) మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ విధానం వచ్చినప్పటికీ ప్రస్తుత సర్వీస్ రూల్స్, అధికారుల విచక్షణాధికారాల్లో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాల్లో దస్త్రాల పెండింగ్‌ను ఉన్నత స్థాయి నుంచి ట్రాక్ చేయడం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం గణనీయంగా పెరగనుంది.
