హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ-2008 ఉపాధ్యాయ నియామకాల్లో డీఈడీ అభ్యర్థులకు 30 శాతం కేటాయింపులు కల్పిస్తూ 2009లో జారీ చేసిన జీవో 28ను హైకోర్టు సమర్థించింది. ఈ జీవోతో పాటు, దాన్ని సమర్థిస్తూ ఏపీ పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పి. శ్యామ్ కోశి, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చింది.
2008లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కేటగిరీల్లో 52,665 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం డీఈడీ అభ్యర్థులకు 30 శాతం కేటాయింపులు కల్పిస్తూ ప్రభుత్వం సవరణ జీవో తీసుకొచ్చింది. నోటిఫికేషన్ జారీ చేసినంత మాత్రాన ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకూడదనే నిబంధన ఏదీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దరఖాస్తులను ఆహ్వానిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ శిలాశాసనం కాదని, అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష జరగడానికి ముందే ప్రభుత్వం తన విధానాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. అయితే, అటువంటి మార్పులు పారదర్శకంగా జరగాలని, ప్రస్తుత డీఎస్సీ-2008లో నిష్పాక్షిక సూత్రాలకు విరుద్ధమైన చర్యలేవీ లేవని తెలిపింది.
సర్కారు రహస్యంగా నిబంధనలను మార్చలేదు
దరఖాస్తులు సమర్పించిన తర్వాత ప్రభుత్వం రహస్యంగా నిబంధనలను మార్చలేదని ధర్మాసనం పేర్కొంది. సవరణ ఎవరికి వర్తిస్తుందో వారికి సమాచారం అందించడంతోపాటు, కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని తెలిపింది. సవరణ అనంతరం దరఖాస్తుల గడువును రెండుసార్లు పొడిగించడం ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారికి వాటిని పునఃపరిశీలించుకునేందుకు తగిన అవకాశం కల్పించినట్టు పేర్కొంది.
30 శాతం కేటాయింపులపై అభ్యంతరాలుంటే అభ్యర్థులు అప్పుడే ప్రక్రియ నుంచి తప్పుకోవచ్చని లేదా ప్రాథమిక దశలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపింది. పరీక్షలకు మూడు నెలల ముందు సవరణ చేసినప్పటికీ పిటిషనర్లు ఎలాంటి నిరసన వ్యక్తం చేయలేదని, వినతిపత్రాలు సమర్పించలేదని పేర్కొంది. పరీక్షలకు హాజరై, ఫలితాలు వెలువడిన తర్వాత ఎంపిక కాలేదని తెలిసి పిటిషన్లు దాఖలు చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ప్రభుత్వం పత్రికా ప్రకటనలు, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సవరణ వివరాలను ముందుగానే వెల్లడించిందని, అభ్యర్థులందరికీ సిద్ధమయ్యేందుకు అవకాశం కల్పించిందని పేర్కొంది. పరిపాలనా దూరదృష్టితో, సదుద్దేశంతో, పారదర్శకంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేమని స్పష్టం చేస్తూ పిటిషన్లను కొట్టివేసింది.
