- మరో 15 మందికి తీవ్ర గాయాలు
కోటా(రాజస్తాన్): ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆలయ దర్శనానికి వెళుతున్న భక్తుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. భోపాల్‌కు చెందిన ఓ కుటుంబం రాజస్తాన్ రాష్ట్రం శిఖర్ జిల్లాలోని ఖాటు శ్యామ్ జీ ఆలయానికి శుక్రవారం బయలుదేరింది.
మొత్తం 23 మంది ఓ మినీ బస్సులో వెళుతుండగా.. శనివారం ఉదయం కోటా ప్రాంతంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎన్హెచ్ఏఐ అధికారులు, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే కోటాలోని ఎంబీఎస్ ఆసుపత్రికి, న్యూ మెడికల్ కాలేజీకి తరలించారు. కాగా, డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బస్సు అదుపుతప్పి, రెయిలింగ్‌ను ఢీకొట్టి కాలువలో పడిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
లోక్‌సభ స్పీకర్ పరామర్శ
రోడ్డు ప్రమాద విషయం తెలిసిన వెంటనే కోటా ఎంపీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా న్యూ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరపాలని, ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
