ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన విద్యార్థి నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో తనకు జారీ చేసిన 'లీవ్ ఇండియా (భారత్ వీడి వెళ్లాలి)' నోటీసును సవాల్ చేస్తూ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 'లీవ్ ఇండియా' నోటీసు ఏకపక్షమని..దానిపై స్టే ఇవ్వాలని కోరారు. అక్టోబర్ 10న అగస్ట్ క్రాంతి మైదాన్ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం(క్యూరియాసిటీ)తోనే తాను అక్కడకు వెళ్లానని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఆ ప్రాంతం నిషేధితమని పోలీసులు చెప్పగానే తన క్యూరియాసిటీ తగ్గిపోయిందని.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయానని వివరించారు. అయితే, మీడియా తనను చుట్టుముట్టడం వల్ల అక్కడ గందరగోళం ఏర్పడిందని, ఆ సమయంలోనే పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పుట్టుకతో అమెరికా పౌరుడినైనా రెండేండ్ల వయసు నుంచే భారత్ లో ఉంటున్నారని, తనకు ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డు ఉందని ఇమ్రాన్ ఖాన్ తన పిటిషన్లో తెలిపారు.
తాను ఎలాంటి నిరసనల్లోనూ పాల్గొనలేదని, ఏ సంస్థతోనూ సంబంధంలేదని స్పష్టంచేశారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, తన వాదన వినకుండా అక్టోబర్ 28 నాటికి దేశం విడిచి వెళ్లాలని నోటీసు ఇవ్వడం ఏకపక్షమని ఆరోపించారు. కాబట్టి ‘లీవ్ ఇండియా’ నోటీసుపై స్టే ఇవ్వాలని.. దేశం నుంచి బహిష్కరించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థించారు.
