న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట ఈ మరణాలు ఫుడ్ పాయిజనింగ్ వల్ల సంభవించినట్టు భావించినప్పటికీ, ఆస్తి వివాదాల కారణంగానే వారంతా ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ఆదివారం నిర్ధారించారు. శుక్రవారం సాయంత్రం బయటకు వెళ్లొచ్చిన తర్వాత మహేశ్ (37), ఆయన భార్య లలిత (35), పిల్లలు మిష్టి (7), లడ్డు (11), సాక్షాత్ (3) రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో నూడుల్స్ తిన్నారు.
ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. అయితే, మహేశ్ స్వయంగా నూడుల్స్లో విషం కలిపినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఆయన ఫోన్ నుంచి ఒక ఆడియో నోట్ కూడా లభించింది. ఆస్తి పంపిణీకి సంబంధించి తలెత్తిన వివాదాలే తమ మరణానికి కారణమని, తన ఇద్దరు సోదరీమణులు, బావ వేధింపుల వల్లే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆ ఆడియోలో మహేశ్ ఆరోపించారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
