త్వరలో మంథనిలో గార్మెంట్ ఫ్యాక్టరీ.. మహిళలకు ఉపాధి అవకాశాలు: మంత్రి శ్రీధర్ బాబు

త్వరలో మంథనిలో గార్మెంట్ ఫ్యాక్టరీ.. మహిళలకు ఉపాధి అవకాశాలు: మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు  :   మంథని ప్రాంతంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో డిసెంబరులో గార్మెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆదివారం మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుట్టు శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటివరకు 3,040 మందికి ఉచిత శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. 

నవంబర్ 1 నుంచి ఎంపిక చేసిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఈ ఫ్యాక్టరీ ద్వారా 300 నుంచి 400 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గలవారు బృందాలుగా ఏర్పడి పాడి పరిశ్రమ వైపు కూడా ముందుకు రావాలని సూచించారు. అర్హులైన మహిళలకు శిక్షణ అందించేందుకు ములుగునూరు డెయిరీకి పంపించే అవకాశం ఉందని, జనవరి నుంచి ఈ కార్యక్రమాన్ని కార్యాచరణలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 

మంథని, రామగిరి, కమాన్పూర్, ముత్తారం, పాలకుర్తి ప్రాంతాల్లో మహిళా సంఘాల భవనాలతో పాటు, నాలుగు మండలాల్లో 43 అంగన్​వాడీ భవనాల నిర్మాణానికి రూ.5.16 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున ప్రజలు నీటిని, విద్యుత్‌‌ను పొదుపుగా వాడాలని కోరారు.  కాగా, కార్యక్రమంలో 302 మంది లబ్ధిదారులకు సుమారు రూ.కోటి విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. 

కార్యక్రమంలో  మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి కమిటీ సభ్యుడు న్యాయవాది శశిభూషణ్ కాచే, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, నాయకులు తోట్ల తిరుపతి యాదవ్, మంథని సత్యం, రామ్ రాజశేఖర్, పేరవేన లింగయ్య, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఆరెల్లి కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.