- నియోజకవర్గానికి కొత్త అకాడమీని మంజూరు చేసిన ప్రభుత్వం
- గ్రామీణ క్రీడాకారుల్లో సంతోషం
హుస్నాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గానికి కబడ్డీ అకాడమీని మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. దీంతో స్థానిక యువత, క్రీడాభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. హుస్నాబాద్లో ఏర్పాటు చేయనున్న రెసిడెన్షియల్ అకాడమీలో 40 మందికి ఉచిత వసతి, భోజనంతో కూడిన శిక్షణ అందించనున్నారు.
ఇందులో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు అవకాశం కల్పించనున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పర్యవేక్షణలో శిక్షణ కొనసాగనుంది. కోచ్లు, సహాయక సిబ్బంది సహా ఎనిమిది రకాల ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అనుమతులిచ్చారు. అకాడమీ మంజూరు చేయడంతో హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కబడ్డీ క్రీడాకారులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు క్రీడాకారులు, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
