- ఇప్పటికే సిప్ చేస్తున్నవారిపై ఎటువంటి ప్రభావం ఉండదు
న్యూఢిల్లీ: ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కోటక్ సహా దాదాపు 17కు పైగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ , గోల్డ్, -సిల్వర్ ఫండ్లకు సంబంధించి కొత్త పెట్టుబడులు తీసుకోవడాన్ని శుక్రవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేశాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి. ధన్తేరస్, దీపావళి పండుగల వేళ బంగారం కొనుగోళ్లకు డిమాండ్ పెరిగే సమయంలోనే ఈ నిర్ణయం రావడం గమనార్హం.
సెబీ ఆదేశాల మేరకే ఫండ్ హౌస్లు ఈ చర్యలు తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆంక్షల ప్రకారం కొత్త లంప్సమ్ పెట్టుబడులు, స్విచ్-ఇన్ లావాదేవీలు, కొత్త సిప్లు, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ (ఎస్టీపీ) కు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్లను అనుమతించరు. అయితే, ఇప్పటికే నడుస్తున్న సిప్లపై రూల్స్ యథావిధిగా కొనసాగుతాయి. ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ యూనిట్లను అమ్ముకోవడానికి ఎటువంటి ఆటంకం ఉండదు.
