ప్రైవేటు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులపై సుప్రీం సీరియెస్: విద్యార్థులకు ఊరటనిచ్చే తీర్పు

ప్రైవేటు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులపై సుప్రీం సీరియెస్: విద్యార్థులకు ఊరటనిచ్చే తీర్పు

ప్రైవేట్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు కోర్సు మధ్యలో ఏకపక్షంగా ఫీజులు పెంచడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఫ్యామిలీకి ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. విద్యార్థులు కాలేజీలో ప్రవేశం పొందే ముందే ఆయా కోర్సుల పూర్తి కాలానికి సంబంధించిన ఫీజు ఎంత ఉంటుందనేదానిపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. జాయిన్ అయిన తర్వాత ఫీజులు పెంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కోర్టు.. కేవలం అత్యవసర, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఫీజుల పెంపునకు అవకాశం ఉంటుందని తేల్చి చెప్పేసింది. ఈ తీర్పు విద్యార్థులకు భారీ ఊరటగా నిలుస్తోంది. 

పశ్చిమ బెంగాల్‌లోని డాక్టర్ బి.సి. రాయ్ ఇంజనీరింగ్ కాలేజీలో 2023-27 బ్యాచ్‌కు చెందిన బీటెక్ విద్యార్థులపై విధించిన 37 శాతం ఫీజు పెంపును, కొత్త డెవలప్‌మెంట్ ఫీజును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. కోర్సు మధ్యలో ఫీజులు పెంచడం వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటాయని ఫీజులపై అనిశ్చితి ఉండకూడదని కోర్టు నొక్కిచెప్పింది.

మన దేశంలో ప్రొఫెషనల్ విద్యను అభ్యసించడం సాధారణ విషయం కాదని.. ఎన్నో సంవత్సరాల సేవింగ్స్ తో, అప్పులు చేసి తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. సాధారణ కోర్సులతో పోలిస్తే ప్రొఫెషనల్ కోర్సుల ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయని.. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి కోర్సుల ఫీజులు దాదాపు 711 శాతం అధికంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఫీజులు పెంచితే వారి ఆర్థిక ప్రణాళిక తలకిందులవుతుందని, చదువుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే పారదర్శకమైన ఫీజుల విధానం అవసరమని పేర్కొంది.

►ALSO READ | ఒక తెల్లవాడు మన దేశానికి ఆర్డర్లు వేయలేడు.. ఎలాన్ మస్క్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్

సంస్థలు విద్యా రంగానికి చేస్తున్న సేవలను అభినందించినప్పటికీ.. కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకూడదని కోర్టు హెచ్చరించింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(AICTE) నిబంధనలు, జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం.. అడ్మిషన్‌కు ముందే కోర్సు పూర్తి కాలానికి సంబంధించిన ఫీజులను ముందుగానే ప్రకటించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. విద్యార్థులు చేరిన తర్వాత ఇష్టానుసారంగా ఫీజులు పెంచడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రొఫెషనల్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనంగా నిలవనుంది. ఇష్టానుసారంగా ఫీజులు పెంచే కాలేజీలకు ఈ తీర్పు పెద్ద ఎదురుదెబ్బని న్యాయ నిపుణులు, విద్యావేత్తలు అంటున్నారు.