హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 78వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ అక్టోబర్ 17న జరగనుంది. 45 వారాల పాటు ఫేజ్-1 శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు ఈ పరేడ్లో పాల్గొననున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎస్వీపీ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ సుజీత్ పాండే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ బ్యాచ్లో మొత్తం 151 మంది ఆఫీసర్ ట్రైనీలు ఉన్నారు. వీరిలో 135 మంది భారతీయ ఐపీఎస్ అధికారులు కాగా, నేపాల్, భూటాన్, మాల్దీవుల నుంచి 16 మంది విదేశీ అధికారులు శిక్షణ పొందారు. మొత్తం బ్యాచ్లో 37 మంది మహిళా అధికారులు ఉన్నారు. శిక్షణలో భాగంగా అధికారులు పోలీసు విధులు, దర్యాప్తు, అంతర్గత భద్రతకు సంబంధించిన పలు అంశాల్లో వీరికి ప్రత్యేక శిక్షణ అందించారు.
►ALSO READ | ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి... ఎల్ నినో టైంలో ఎవరూ నిర్లక్ష్యం చేయద్దు: సీఎం రేవంత్
సైబర్ నేరాలు, డ్రోన్ల ద్వారా ఎదురయ్యే ముప్పులు, డ్రగ్ ట్రాఫికింగ్ను అరికట్టడం వంటి అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. కొత్త క్రిమినల్ చట్టాలు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, నేరాల దర్యాప్తు పద్ధతులపై అవగాహన కల్పించారు. అంతర్గత భద్రత, అల్లర్ల నియంత్రణలో శిక్షణ అందించారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, గ్రేహౌండ్స్, భారత సైన్యంతో కలిసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం ట్రైనీ అధికారులు ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రిని కలవనున్నారు. అనంతరం తమకు కేటాయించిన జిల్లాల్లో 29 వారాల పాటు ప్రాక్టికల్ శిక్షణ పొందుతారు. ఆ తర్వాత 2027 జూన్ 21 నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో రెండో దశ శిక్షణ ప్రారంభం కానుంది. ఈ దశలో మరో తొమ్మిది వారాల పాటు శిక్షణ పూర్తి చేయనున్నారు.
