ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత రంగంలో దూసుకుపోతున్న సౌత్ కొరియా ప్రస్తుతం ఒక తీవ్రమైన ఆర్థిక, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. స్టాక్ మార్కెట్లలో ఊహించని క్రాష్, విపరీతమైన అప్పులు అక్కడి యువతను, సామాన్య ప్రజలను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ అధ్యక్షులు స్పందిస్తూ.. "దయచేసి ఆత్మహత్యలకు పాల్పడకండి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం బ్రతికి తీరాలి" అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య ఆలోచనలు వస్తే సహాయం కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.
కోస్పి క్రాష్‌తో నష్టపోయిన రిటైల్ ఇన్వెస్టర్లు:
సౌత్ కొరియా ప్రధాన స్టాక్ సూచీ అయిన 'కోస్పి' ఒక్కరోజే 9 శాతం వరకు పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఎస్కే హైన్రిక్స్, శామ్సంగ్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు రికార్డు స్థాయిలో పడిపోయాయి. త్వరగా కోటీశ్వరులు కావాలనే ఆశతో యువ ఇన్వెస్టర్లు భారీగా అప్పులు చేసి లెవరేజ్డ్ ట్రేడింగ్, ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టారు. అయితే మార్కెట్ ఒక్కసారిగా పడిపోవడంతో లక్షలాది మంది మార్జిన్ కాల్స్ ఎదుర్కొని, తమ డిపాజిట్లను కోల్పోయారు. సుమారు 3.2 లక్షలకు పైగా రిటైల్ ఇన్వెస్టర్ల ఖాతాలు ఫోర్స్డ్ లిక్విడేషన్‌కు గురై నిండా మునిగారు. ముఖ్యంగా నష్టపోయిన వారిలో 20 నుంచి 30 ఏళ్ల యువత దాదాపు 62 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఆత్మహత్యల నివారణకు చర్యలు:
పెరిగిపోతున్న అప్పుల భారంతో ప్రజలు బలవన్మత్వానాలకు పాల్పడుతుండటంతో సౌత్ కొరియా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ నేతృత్వంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడటం ఒక రకమైన సామాజిక హత్య వంటిదేనని ప్రభుత్వం అభివర్ణించింది. ప్రజలను ఈ ఊబి నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం అత్యవసర విధివిధానాలను ప్రకటించింది.
దేశవ్యాప్త లోన్ కౌన్సిలింగ్ హెల్ప్‌లైన్:
ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలలో భాగంగా అక్టోబర్ నెలలో '1375' అనే దేశవ్యాప్త ఏకీకృత లోన్ కౌన్సిలింగ్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించనున్నారు. టోల్-ఫ్రీ నంబర్‌గా ఉండే దీని ద్వారా పౌరులు అప్పులను రీస్ట్రక్చర్ చేసుకోవటం, దివాలా తీయడంపై సహాయం, వ్యక్తిగత పునరావాసం, ఉపాధి అవకాశాల గురించి ఒకే ఫోన్ కాల్ ద్వారా సమాచారం పొందవచ్చు.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబాలను ముందుగానే గుర్తించేందుకు 'స్పెషల్ ఐడెంటిఫికేషన్ మోడల్'ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అప్పుల సమాచారంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లింపుల రికార్డులను అనుసంధానించడం ద్వారా ప్రమాదంలో ఉన్న కుటుంబాలను ముందుగానే గుర్తిస్తారు. మరోవైపు బీఎన్ కే బుసాన్ బ్యాంక్, వూరి కార్డ్ వంటి ప్రైవేట్ ఆర్థిక సంస్థలు అట్టడుగు వర్గాల కోసం ప్రత్యేక తక్కువ వడ్డీ రుణాలను, 'వూరి హోప్ కార్డ్' వంటి సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు అండగా ఉండేందుకు ఉచిత క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ సదుపాయాలను కల్పిస్తున్నాయి. మెుత్తానికి ఏఐ ఊపులో ఒకానొక దశలో 150 శాతం లాభాలు అందించిన సౌత్ కొరియా మార్కెట్లు కుప్పకూలటంతో భారీగా పెట్టుబడులు పెట్టిన అక్కడి యువతకు చావే శరణ్యం కావటం అప్పు చేసి పెట్టుబడులు ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపిస్తోంది.
