దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయ ప్రయోజనాలను, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవాలంటే బిల్లుకు మద్దతు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని తేల్చిచెప్పారు.
Chennai, Tamil Nadu | After meeting Sonia Gandhi, Rahul Gandhi, and other INDIA bloc leaders, DMK President MK Stalin says, "If delimitation is carried out on the basis of the 1971 Census, Tamil Nadu will be adversely affected; the southern states as a whole will be affected. For political parties from the southern states in particular, this is a battle for survival. Under these circumstances, there is no alternative but to support this Bill. There is no other alternative proposal either. Using the strength we have in Parliament, we have safeguarded Tamil Nadu's political future for the next 25 years. There is absolutely no room for making an emotional or impulsive decision on this matter. From Anna to Stalin, we have fought for state rights, and we will emerge victorious in that struggle. With leaders from across India having come here, our position remains the same, in the past, in the present, and forever. Tamil Nadu comes first."
— ANI (@ANI) November 29, 2026
ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం నేత ఎం.ఏ. బేబీతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు స్టాలిన్‌తో సమావేశమయ్యారు. డీలిమిటేషన్ బిల్లుపై తమ అభిప్రాయాలు, డిమాండ్లను ఆయనకు వివరించారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన స్టాలిన్.. డీఎంకే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని, తమ పార్టీ మొదటి నుంచి చేస్తున్న డిమాండ్లను కొత్త బిల్లులో చేర్చిన అంశాన్ని ప్రతిపక్ష నేతలకు వివరించినట్లు తెలిపారు. ఇతర నేతలు లేవనెత్తిన అభ్యంతరాలను కూడా శ్రద్ధగా విన్నామని చెప్పారు.
ప్రస్తుత బిల్లును వ్యతిరేకించి ఓడిస్తే తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న కనీస ప్రయోజనాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని స్టాలిన్ నిట్టూర్చారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. 2027 జనవరిలో ఏర్పడనున్న డీలిమిటేషన్ కమిషన్ ద్వారా తమిళనాడుతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నిబంధనలను మార్చడానికి అవసరమైన రాజకీయ బలం, పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ తమకు లేవని గుర్తుచేశారు.
1971 జనాభా లెక్కలకు బదులుగా ఆ తర్వాతి జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే తమిళనాడు తప్పకుండా నష్టపోతుందని స్టాలిన్ పేర్కొన్నారు. దీనివల్ల లోక్‌సభలో రాష్ట్ర ఎంపీ స్థానాల శాతం తగ్గడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం, ప్రాతినిధ్యం బలహీనపడతాయని వివరించారు.
ముఖ్యంగా దక్షిణాది ప్రాంతీయ పార్టీల రాజకీయ భవిష్యత్తుకు ఇది కీలకమైన అంశమని అన్నారు. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు ప్రస్తుత బిల్లుకు మద్దతు ఇవ్వడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, తనను కలిసిన ప్రతిపక్ష నేతలు కూడా స్పష్టమైన ప్రత్యామ్నాయ ప్రణాళికను సూచించలేకపోయారని తెలిపారు.
ALSO READ :డీలిమిటేషన్ పై స్టాలిన్ తో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వాదన ఇది..
రాబోయే 25 ఏళ్ల పాటు తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భావోద్వేగాలకు లోనై రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టలేమని స్పష్టం చేశారు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అడుగుజాడల్లో నడుస్తూ తమిళనాడు హక్కుల కోసం పోరాడతానని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
