- ఆనాడు బ్యారేజీలు కట్టడంపై పెట్టిన శ్రద్ద.. భూగర్భ పరీక్షలపై పెట్టలే
- అందుకే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది
- బ్యారేజీల పునాదులను బలోపేతం చేస్తం
- త్వరలోనే బ్యారేజీలకు రిపేర్లు.. పనులకు కేంద్ర సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ఆమోదం
- ప్రస్తుతం మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయడం అంటే బ్యారేజీలను మరింత రిస్క్‌లోకి నెట్టడమే
- ‘వీ6 వెలుగు’ ఇన్నర్ వ్యూలో కల్నల్ పరీక్షిత్ మెహ్రా
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదులన్నీ వీక్‌గా ఉన్నాయని, అప్పట్లో బ్యారేజీలు కట్టడంపై పెట్టిన శ్రద్ధ.. భూగర్భ పరీక్షలపై పెట్టలేదని అందుకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, మిగిలిన బ్యారేజీలకు సీపేజ్‌లు వచ్చాయని ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ వర్క్స్‌ను పర్యవేక్షిస్తున్న కల్నల్ పరిక్షిత్ మెహ్రా అన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా మూడు బ్యారేజీలను పునాదులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
త్వరలోనే బ్యారేజీలకు రిపేర్లు ప్రారంభిస్తామని, ఈ పనులకు కేంద్ర సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ఆమోదం లభించిందని చెప్పారు. ఈ కమిటీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్డీఎస్ఏ) ప్రతినిధులు ఉన్నారని, వారి ఆధ్వర్యంలోనే బ్యారేజీలకు రిపేర్లు చేపడ్తామని ఆయన వివరించారు. - ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయడం అంటే బ్యారేజీలను మరింత ప్రమాదంలోకి నెట్టడమేనని అభిప్రాయపడ్డారు. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ప్రస్తుతం రాష్ట్ర టన్నెల్స్ అండ్ సేఫ్టీ విభాగం సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈయన ఇండియన్ ఆర్మీ సివిల్ ఇంజనీర్, టన్నెలింగ్ అండ్ రాక్ మెకానిక్స్ ఎక్స్పర్ట్. అటల్ టన్నెల్ దగ్గర నుంచి చాలా వరకు సొరంగాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఉత్తరాఖండ్‌లో ఒక రిస్కియస్ట్ రెస్క్యూ ఆపరేషన్‌లో కీ రోల్ ప్లే చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులు, కాళేశ్వరం మరమ్మతులను పర్యవేక్షిస్తున్న పరీక్షిత్ మెహ్రా ‘వీ6 వెలుగు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
వీ6 వెలుగు: మీరు రాష్ట్రానికి రావడానికి గల కారణం?
మెహ్రా: రాష్ట్రంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి దురదృష్టవశాత్తూ 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) సహాయం కోరింది. ఎన్డీఎంఏ భారత సైన్యాన్ని సంప్రదించి, నిపుణులను పంపించాలని అడిగింది. నాకు సొరంగ నిర్మాణం, సహాయక చర్యల్లో అనుభవం ఉండటంతో, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ నుంచి అక్కడికి పంపించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడమే నా బాధ్యత. నేను మొదటిసారి ఎస్ఎల్బీసీకి వెళ్లినప్పుడు ఒక్క యూనిఫామ్ మాత్రమే తీసుకెళ్లాను. ఒక్కరోజు ఉండి, ఏదైనా సలహా ఇచ్చి తిరిగి వచ్చేయవచ్చని అనుకున్నాను. టన్నెల్ బోరింగ్ మెషీన్ల గురించి నాకు పరిజ్ఞానం ఉంది. అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి ఎనిమిది మందిని రక్షించడానికి ఏదైనా మార్గం ఉందేమో చూడాలనుకున్నాను. సొరంగం లోపలికి వెళ్లి, సొరంగ గోడలకు పిటాన్లు, తాళ్లను అమర్చుకుంటూ చివరికి కూలిపోయిన ప్రాంతం వరకు చేరుకున్నాం. అక్కడ సొరంగం కదలిక ఆగిపోయినట్లు గమనించాను. చివరకు ఫిబ్రవరి 26న తొలిసారిగా ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నాం.
ఎస్ఎల్బీసీలో పనులెలా జరుగుతున్నాయి?
అక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చాం. టన్నెల్ లోపల చాలా కిలోమీటర్ల దూరం వెళ్లి కార్మికులు పనిచేయాలంటే ముందుగా వాళ్లకు సేఫ్టీ అవసరం. సొరంగంలో త్రీడీ మానిటరింగ్ వ్యవస్థలు, కొలతల కోసం ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేశాం. సొరంగం స్థిరంగా ఉందా లేదా అనే విషయాన్ని నిరంతరం పరిశీలిస్తున్నాం. సొరంగం ఎక్కడైనా అస్థిరంగా మారితే ముందుగానే గుర్తించి, కార్మికులను సురక్షితంగా బయటకు తేవడానికి తగిన సమయం లభిస్తుంది. గతంలో ఇలాంటి పర్యవేక్షణ లేకుండా పనిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కార్మికులకు కూడా తమ భద్రతపై నమ్మకం పెరిగింది. గతంలో అందుబాటులో లేని ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించాం. దీంతో సొరంగ మార్గంలో ఎక్కడెక్కడ బలహీనమైన రాతి ప్రాంతాలు, షియర్ జోన్లు ఉన్నాయో ముందుగానే గుర్తించగలిగాం. ప్రస్తుతం సాఫీగా పనులు జరుగుతున్నాయి.
మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణం ఏమిటి?
మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వెనుక ప్రధానంగా రెండు సాంకేతిక సమస్యలు గుర్తించాం. మొదటిది పైపింగ్ వైఫల్యం, రెండోది శక్తి వెదజల్లే నిర్మాణాల్లో సమస్యలు. మేడిగడ్డ బ్యారేజీలో సికెంట్ పైల్స్ ఉపయోగించారు. ఈ పైల్స్‌కు రాఫ్ట్ నిర్మాణంతో ఉన్న అనుసంధానంలో సమస్యలు ఏర్పడ్డాయి. వాటి మధ్య నుంచి నీరు ప్రవహించడం ప్రారంభించింది. దీనినే పైపింగ్ అంటారు. ఈ ప్రక్రియలో నీరు పునాది కింద ఉన్న మట్టి క్రమంగా కొట్టుకుపోయి పునాది లోపల ఖాళీలు ఏర్పడి, నిర్మాణం కుంగిపోతుంది. రెండో సమస్య నీటి ప్రవాహం వల్ల ఏర్పడే అధిక శక్తికి సంబంధించినది. బ్యారేజీ నుంచి నీరు కిందికి దూకినప్పుడు భారీ శక్తి విడుదలవుతుంది. ఆ శక్తిని నియంత్రించడానికి స్టిల్లింగ్ బేసిన్లు ఏర్పాటు చేస్తారు. కానీ మేడిగడ్డలో నీరు ఆ స్టిల్లింగ్ బేసిన్లను దాటి ముందుకు ప్రవహించింది. దీంతో నదీ గర్భంలో కోత ఏర్పడింది. ఇలాంటి సమస్య బ్లాక్ సెవెన్లో మాత్రమే జరిగిందని భావించకూడదు. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో
మేడిగడ్డ బ్యారేజీ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయవచ్చా?
మేడిగడ్డ బ్యారేజీ నుంచి గోదావరి నీటిని ప్రస్తుతం ఎత్తిపోయడం వీలుకాదు. మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసినా ఆ నీరు అన్నారం వైపు వెళ్లాలి. అక్కడి నుంచి బ్యాక్‌వాటర్ ఏర్పడి పంప్‌హౌస్‌కు చేరాలి. అక్కడి నుంచి సుందిళ్ల, ఎల్లంపల్లి తదితర ప్రాంతాలకు తరలించాలి. ఇప్పటికే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసి వినియోగించడం ఎంతవరకు సమంజసం? మళ్లీ అదే నిర్మాణాలను ప్రమాదంలోకి నెట్టడం తెలివైన పని కాదు. అందువల్ల ముందుగా మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తి చేసి, ఆ తర్వాత నీటిని వినియోగించాలి.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం తప్పు జరిగింది?
దురదృష్టవశాత్తూ అప్పట్లో నిర్మాణంపై చూపిన శ్రద్ధతో పోలిస్తే, నిర్మాణానికి ముందు చేయాల్సిన భూగర్భ పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ దశలో కూడా సమగ్ర పరిశోధనలు నిర్వహించి ఉంటే నిర్మాణం మరింత జాగ్రత్తగా జరిగి ఉండేది. ఒక ప్రాజెక్టులో ఎన్ని పరీక్షలు అవసరమో, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంతకంటే మూడు రెట్లు ఎక్కువ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని అనుకున్నప్పుడు, తీసుకునే నిర్ణయాలకు తగిన సమాచారం ఉండాలి. ఇప్పుడు మనకు గత అనుభవాల నుంచి పాఠాలు లభించాయి. వాటి ఆధారంగా ముందుకు సాగాలి.
కాళేశ్వరం బ్యారేజీల రిపేర్స్ ఎలా చేయబోతున్నారు?
పునరుద్ధరణలో ప్రధానంగా కాంక్రీట్ పనులు, పునాది బలోపేతం చేస్తాం. ఈ పనులకు సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ఆమోదం లభించింది. ఇందులో సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ ప్రతినిధులు ఉన్నారు. ఈ కమిటీని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించింది. ముందుగా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం 3 బ్యారేజీలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాం. అంతర్జాతీయ స్థాయి డిజైనర్ల సహాయంతో పునరుద్ధరణ పనులకు కొత్త డిజైన్లు రూపొందించినం. ఈ పనిలో అనేక సంస్థలు భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. బ్యారేజీలను నిర్మించిన కాంట్రాక్టర్లు, సీడబ్ల్యూఫీఆర్ఎస్, ఏఎఫ్ఆర్వై, ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాలు తదితర సంస్థల మధ్య సమన్వయం అవసరం. మేడిగడ్డకు సంబంధించి సీడబ్ల్యూఫీఆర్ఎస్ ఇప్పటికే రెండు డైమెన్షనల్ మోడల్స్ రూపొందించింది. అదే విధమైన పరిశీలన మిగతా రెండు బ్యారేజీల దగ్గర చేపడుతున్నాం. కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించిన మోడల్స్ ప్రకారం రిపేర్ వర్క్స్ చేపడతాం.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు గురించి మీ అభిప్రాయం?
సాంకేతికంగాఈ ప్రాజెక్టు సాధ్యమేనని నేను భావిస్తున్నాను. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంతంలో వ్యవసాయ పరిస్థితులు గణనీయంగా మారతాయి. ప్రజల జీవన విధానంలో కూడా మంచి మార్పు వస్తుంది. కాళేశ్వరం, తుమ్మిడిహెట్టి వంటి పెద్ద ప్రాజెక్ట్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
