- ప్రస్తుతం దక్షిణాదికి 130.. మిగతా రాష్ట్రాలకు 413 సీట్లు
- పెంపు తర్వాత సౌత్‌కు 195.. మిగతా రాష్ట్రాలకు 621
- ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య సీట్ల గ్యాప్ 283 నుంచి 426కు
- అదనంగా 143 సీట్ల వ్యత్యాసం.. పార్లమెంటులో సౌత్ గొంతు బలహీనం
- డీలిమిటేషన్‌పై గణాంకాలతో రాహుల్‌కు ముఖ్యమంత్రి నివేదిక
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ సీట్ల పెంపులో కేంద్రం ప్రతిపాదించిన 50 శాతం ప్రోరేటా ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు 130 లోక్‌సభ సీట్లు ఉండగా, ఉత్తరాది సహా మిగతా రాష్ట్రాలకు 413 ఉన్నాయి. వీటి మధ్య 283 సీట్లుగా ఉన్న వ్యత్యాసం.. 50 శాతం పెంపు తర్వాత 426కు చేరుతుందని
వివరించారు. దక్షిణాదికి 195, మిగతా రాష్ట్రాలకు 621 సీట్లు వస్తాయని, దీంతో అదనంగా 143 సీట్ల గ్యాప్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఫలితంగా పార్లమెంటులో దక్షిణాది రాజకీయ ప్రాధాన్యం, విధాన నిర్ణయాలపై ప్రభావం తగ్గుతుందని అన్నారు. ఈ అంశంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఫోన్లో మాట్లాడిన రేవంత్.. గణాంకాలతో కూడిన నివేదికను అందించినట్లు తెలిసింది.
పెద్ద రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు
డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు, 2026లోని సెక్షన్ 10 ప్రకారం.. చట్టం అమల్లోకి రావడానికి ముందు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం పెంపు వర్తించనుంది. అన్ని రాష్ట్రాలకూ ఒకే నిష్పత్తిలో పెంచినా, ప్రస్తుతం ఎక్కువ సీట్లు ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకే అదనపు ప్రయోజనం కలుగుతుందని రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 543 లోక్‌సభ సీట్లలో దక్షిణాది వాటా 130 కాగా, 50 శాతం పెంపుతో మరో 65 కలిసి 195కు చేరుతుంది. మిగతా రాష్ట్రాల సీట్లు 413 నుంచి సుమారు 621కు పెరుగుతాయి. దీంతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య సీట్ల అంతరం 283 నుంచి 426కు ఎగబాకుతుందని ఆయన గణాంకాలతో వివరించారు.
తెలంగాణ, యూపీ మధ్యా పెరగనున్న గ్యాప్
రాష్ట్రాల వారీగా చూస్తే ఈ వ్యత్యాసం మరింత స్పష్టమవుతుందని రేవంత్ పేర్కొంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలుండగా, ఉత్తరప్రదేశ్‌లో 80 ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల మధ్య 63 సీట్ల తేడా ఉంది. 50 శాతం పెంపు తర్వాత తెలంగాణ సీట్లు 17 నుంచి 26కు, యూపీ సీట్లు 80 నుంచి 120కి పెరుగుతాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య అంతరం 63 నుంచి 94కు చేరుతుంది. కేరళలో ప్రస్తుతం 20 సీట్లుండగా, యూపీతో వ్యత్యాసం 60. పెంపు తర్వాత కేరళకు 30, యూపీకి 120 సీట్లు వస్తే ఈ గ్యాప్ 90కి పెరుగుతుంది.
నిర్ణయాలపై దక్షిణాది ప్రభావం తగ్గే ప్రమాదం
పార్లమెంటులో సంఖ్యాబలమే రాజకీయ నిర్ణయాలను శాసిస్తుందని, 143 సీట్ల అదనపు వ్యత్యాసంతో దక్షిణాది గొంతు బలహీనపడుతుందని సీఎం వాదిస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి రావాలనుకునే పార్టీలు ఎక్కువ సీట్లున్న రాష్ట్రాలపైనే దృష్టి పెడతాయని, దీంతో దక్షిణాది అవసరాలు, ప్రయోజనాలకు ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు, రాజ్యాంగ సవరణలు, కీలక బిల్లుల ఆమోదంలో దక్షిణాది రాష్ట్రాల బేరసారాల శక్తి తగ్గుతుందని పేర్కొంటున్నారు. పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యత్వం, సభలో చర్చలకు కేటాయించే సమయం కూడా సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయని గుర్తుచేస్తున్నారు.
ఆర్థిక వాటాకు తగ్గకుండా రాజకీయ ప్రాతినిధ్యం
కేవలం జనాభా లేదా ప్రోరేటా ప్రాతిపదికన కాకుండా, ప్రస్తుతం రాష్ట్రాల మధ్య ఉన్న సీట్ల వ్యత్యాసాన్ని కూడా డీలిమిటేషన్లో పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. దేశ జీడీపీ, కేంద్ర పన్నుల వసూళ్లలో దక్షిణాది రాష్ట్రాలు గణనీయమైన వాటా అందిస్తున్నాయని, అయినా ఆర్థిక సంఘం నిధుల పంపిణీలో ఇప్పటికే నష్టం జరుగుతోందని పేర్కొంటున్నారు. దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. 50 శాతం ప్రోరేటా ఫార్ములాపై కేంద్రం పునరాలోచించి, దక్షిణాది ప్రయోజనాలను కాపాడేలా డీలిమిటేషన్ విధివిధానాలు రూపొందించాలని కోరారు.
ఢిల్లీకి సీఎం రేవంత్
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అమలు అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగే కీలక సమావేశాల్లో పాల్గొననున్నారని తెలుస్తోంది. డీలిమిటేషన్ బిల్లు ప్రతిపాదనపై దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనలు, రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు తెలంగాణ, కేరళ, కర్నాటక సీఎంల భేటీ జరగనుంది. నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ తమ వైఖరిని ఖరారు చేయడంతో పాటు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
