డీలిమిటేషన్ హీట్.. బిల్లును లోక్‌‌సభకు సిఫార్సు చేసిన రాష్ట్రపతి

డీలిమిటేషన్ హీట్.. బిల్లును లోక్‌‌సభకు సిఫార్సు చేసిన రాష్ట్రపతి
  • 2011 జనాభా లెక్కల ఆధారంగా 
  • నియోజకవర్గాల పునర్విభజన
  • 2029 ఎన్నికల నుంచి మహిళలకు 33%  రిజర్వేషన్లు
  • నియోజకవర్గాల లెక్కల్లో నేతలు.. కొత్త సీట్లపై ఆశలు
  • బిల్లుకు మద్దతిస్తామని డీఎంకే ప్రకటన
  • ఢిల్లీలో ఇండియా కూటమి పక్షాల సమావేశం
  • అధికారాన్ని శాశ్వతం చేసుకునే కుట్ర: ఖర్గే


 

న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన బిల్లు దేశ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది. లోక్‌‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్రం ప్రతిపాదించడంతో అన్ని పార్టీల్లోనూ కొత్త లెక్కలు మొదలయ్యాయి. లోక్‌‌సభ బలం 850కి, రాష్ట్రాల అసెంబ్లీల గరిష్ట సీట్ల సంఖ్య650కి చేరేలా బిల్లును రూపొందించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల హద్దులు మార్చడంతోపాటు 2029 ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నది. జనాభా ప్రాతిపదికన కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం సీట్లు పెంచేలా మార్పులు చేసింది.

శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లును పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. డీలిమిటేషన్‌‌తో పాటు రాజ్యాంగ సవరణ బిల్లుతో 33% మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులను తొలగించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో రాజ్యసభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పక్షాలు సమావేశమై బిల్లుపై చర్చించాయి. పార్లమెంటులో బిల్లును అడ్డుకుంటామని స్పష్టం చేశాయి. బిల్లుతో బీజేపీ తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని చూస్తున్నదని ఖర్గే మండిపడ్డారు.

మహిళల దశాబ్దాల నిరీక్షణకు ఈ చారిత్రక డీలిమిటేషన్​ బిల్లు ముగింపు పలుకుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.  ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ బిల్లుకు మద్దతు ఇస్తుందని ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా బిల్లుకు మద్దతు తెలిపారు. 

సీట్ల పెంపు.. మహిళా కోటా

రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు ద్వారా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్ల వాటాను 2051 వరకు స్థంభింపజేస్తూనే ఈ పెంపు చేపట్టనున్నారు. దీంతో లోక్‌సభ గరిష్ఠ బలం 850కి చేరుతుంది. ఇందులో రాష్ట్రాల నుంచి 815, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 స్థానాలు ఉంటాయి. రాష్ట్రాల అసెంబ్లీల గరిష్ఠ సభ్యుల సంఖ్య కూడా 650 వరకు పెరగనుంది. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని నియోజకవర్గాల హద్దులను పునర్విభజించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియతోపాటు మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని కేంద్రం భావిస్తున్నది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచే లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే దిశగా అడుగులు వేస్తున్నది. గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందకపోవడంతో తాజా సవరణలతో మళ్లీ తీసుకొస్తున్నది. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూకాశ్మీర్ ప్రాంతాలు విముక్తి పొందిన తర్వాత వాటి పునర్విభజన బాధ్యతలను ఎన్నికల కమిషన్‌కు అప్పగించేలా బిల్లులోని సెక్షన్ 3(4)లో వెసులుబాటు కల్పించారు.

బిల్లుపై విపక్షాల అభ్యంతరాలు

డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుంటామని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. శనివారం ఇండియా కూటమి నేతలు సుమారు రెండు గంటలపాటు సమావేశమై బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించారు. 850 మంది సభ్యులతో లోక్‌సభ పనితీరు ఎలా ఉంటుంది? 2011 జనాభా లెక్కలనే ఎందుకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు? దీని వల్ల ఏ పార్టీకి రాజకీయ ప్రయోజనం కలుగుతుంది? అనే అంశాలపై విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బీజేపీ కేంద్రంలో తన అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకే అడ్డదారిలో డీలిమిటేషన్ చేపడుతున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

మరోవైపు, తమ షరతులకు అనుగుణంగా బిల్లులో మార్పులు చేయడంతో మద్దతు ఇస్తున్నామని డీఎంకే ప్రకటించింది. ఎన్సీపీ (శరద్ పవార్) తరఫున ప్రఫుల్ పటేల్ కూడా మద్దతు తెలిపారు. అయితే బిల్లుకు డీఎంకే మద్దతు ఇవ్వడంపై వీసీకే నేత తోల్ తిరుమావళవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్రం లోపభూయిష్టమైన పునర్విభజన చేపడుతున్నదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విమర్శించారు. మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ బిల్లు వల్ల మహారాష్ట్ర రాజకీయ ప్రాతినిధ్యానికి ముప్పు ఏర్పడుతుందని ఆదిత్య థాకరే ఆందోళన వ్యక్తం చేశారు. యూపీకి 120 సీట్లు పెరిగితే మహారాష్ట్రతో సీట్ల వ్యత్యాసం 48కి చేరుతుందని వివరించారు. ప్రజలకు ఇష్టం లేకపోయినా మరో 25 ఏండ్లపాటు బీజేపీ అధికారంలో కొనసాగేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 వరకు పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.
 
లోక్‌సభకు రాష్ట్రపతి సిఫార్సు

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు డీలిమిటేషన్ బిల్లుకు కీలక రాజ్యాంగ ప్రక్రియ పూర్తయింది. డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు-2026ను లోక్‌సభ పరిశీలనకు స్వీకరించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సిఫార్సు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(3) ప్రకారం ఈ సిఫార్సు చేసినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్‌లో వెల్లడించింది. భారత సంచిత నిధి నుంచి ఖర్చుకు దారితీసే బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి సిఫార్సు తప్పనిసరి. శుక్రవారం కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు పంపిన లేఖ ఆధారంగా ఈ సిఫార్సు చేశారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనున్న నాలుగు రోజుల ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది. 

కొత్త సీట్లపై నేతల ఆశలు

సీట్ల పెంపు ప్రతిపాదనతో రాజకీయ పార్టీల్లో నియోజకవర్గాల లెక్కలు మొదలయ్యాయి. ప్రతి రాష్ట్రంలో లోక్‌‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెరగనుండటంతో కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. తమ ప్రాంతాల్లో కొత్త సీట్లు వస్తాయని, పోటీకి మరిన్ని అవకాశాలు దక్కుతాయని ఆశావహులు భావిస్తున్నారు. ఏ నియోజకవర్గం ఎక్కడ ఏర్పడుతుంది? ఏ ప్రాంతం ఏ సీటులో కలుస్తుంది? ఏ స్థానాలు మహిళలకు, ఇతర రిజర్వేషన్లకు కేటాయిస్తారు? అనే అంశాలపై చర్చలు సాగుతున్నాయి. స్థానిక నేతల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల వరకు ఎవరికి ఏ సీటు కలిసొస్తుందనే లెక్కల్లో మునిగిపోయారు.