వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్‌లు ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్!

వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్‌లు ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్!

పొద్దున నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లేనిదే క్షణం గడవదు. చిన్నాపెద్దా తేడా లేకుండా కోట్లాది మంది వాడుతున్న ఈ యాప్‌పై ఇప్పుడు మరో సైబర్ ముప్పు పొంచి ఉంది. మీ ఫోన్‌లో వాట్సాప్ కు  వచ్చే అనుమానాస్పద మెసేజ్ లేదా లింక్ క్లిక్ చేస్తే చాలు.. మీ పర్సనల్ డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని కేంద్ర సైబర్ భద్రతా సంస్థ (CERT-In) సంచలన హెచ్చరిక జారీ చేసింది.

వాట్సాప్ యూజర్లకు భారత సైబర్ భద్రతా సంస్థ CERT-In కీలక హెచ్చరిక జారీ చేసింది. వాట్సాప్‌లో కొన్ని భద్రతా లోపాలు ఉన్నాయని గుర్తించింది. వీటితో హ్యాకర్లు పర్సనల్ డేటాను దొంగిలించే అవకాశం ఉందని చెబుతోంది. నవంబర్ 26న ఓ హెచ్చరికను  జారీ చేసింది. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్, మ్యాక్ కస్టమర్లకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. హానికరమైన మెసేజ్‌లు, లింకులు, ఫైల్స్ ద్వారా ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి చొరబడే ప్రమాదం ఉందని పేర్కొంది. 

వాట్సాప్‌లో గుర్తించిన ఐదు సెక్యూరిటీ  లోపాలను హ్యాకర్లు ఉపయోగించుకుంటే ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, చాట్ వివరాలు వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్ని హానికరమైన లింకుల ద్వారా యూజర్ల ఐపీ అడ్రస్‌ లు కూడా చోరీకి గురయ్యే  అవకాశం ఉంది. ఈ సమాచారాన్ని ఉపయోగించి స్పామ్ మేసేజ్ లు పంపడం, బ్లాక్‌మెయిలింగ్ చేసే అవకాశం ఉందంటున్నారు. 

యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులపై క్లిక్ చేయవద్దు.
  •  అనుమానాస్పద ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ ఓపెన్ చేయొద్దు.
  • వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
  • కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్ వాడిన తర్వాత లాగ్‌అవుట్ కావాలి.
  • అనుమానాస్పద మెసేజ్‌లకు స్పందించకుండా తొలగించాలి.

తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మేసేజ్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని CERT-In చెబుతోంది. చిన్న నిర్లక్ష్యం కూడా పర్సనల్ డేటాకు  ముప్పుగా మారే అవకాశం ఉన్నందున వాట్సాప్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.