మరో 25 సంవత్సరాలు సీట్లు పెంచొద్దు: డీలిమిటేషన్‎ బిల్లును వ్యతిరేకించిన ఇండీ కూటమి

మరో 25 సంవత్సరాలు సీట్లు పెంచొద్దు: డీలిమిటేషన్‎ బిల్లును వ్యతిరేకించిన ఇండీ కూటమి

న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రతిపక్ష ఇండీ కూటమి వ్యతిరేకించింది. లోక్‌సభ ప్రస్తుత స్థానాల సంఖ్యను పెంచొద్దని.. రాష్ట్రాల వారీగా సీట్ల వాటాను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని డిమాండ్ చేసింది. మహిళా రిజర్వేషన్లు ప్రస్తుత సీట్లలోనే అమలు చేయాలని పేర్కొంది. నియోజకవర్గాల పునర్విభజన తాజా జనాభా లెక్కల ఆధారంగా చేపట్టాలని డిమాండ్ చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో శనివారం (నవంబర్ 28) ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండీ కూటమి భేటీ అయ్యింది. డీలిమిటేషన్ బిల్లుపై పార్లమెంట్‎లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాంపై కూటమి నేతలు చర్చించారు. కేంద్ర ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని భేటీలో నిర్ణయించారు.

డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం: ఖర్గే

ఇండీ కూటమి భేటీ అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకించాలని ఇండియా బ్లాక్ నాయకులు సమిష్టిగా నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోలేదని, ఇది అన్యాయమని పేర్కొన్నారు. 

ALSO READ : డీలిమిటేషన్‎ బిల్లుపై ఇండీ కూటమి కీలక భేటీ.. ఎన్సీపీ (ఎస్పీ) డుమ్మా

ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభాకు అనుపాతంగా వారికి రిజర్వ్ సీట్లు పెరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ అత్యాశ 400 సీట్ల నుంచి 800కి పైగా సీట్లకు పెరిగిందని.. అధికారాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్ పేరుతో ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసి, దాని స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని చూస్తోందని హాట్ కామెంట్ చేశారు.