ముంబై లోకల్ ట్రైన్లు అంటేనే ప్రయాణికులు కిక్కిరిసిపోయి, విపరీతమైన రద్దీ గుర్తుకు వస్తాయి. ప్రతిరోజూ లక్షల మంది ఈ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే తాజాగా ఒక ముంబై లోకల్ ట్రైన్లో చోటుచేసుకున్న వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా ప్రయాణికులతో నిండిపోయే రైలు బోగీని కొంతమంది యువతులు ఏకంగా పెళ్లి వేడుకల వేదికగా మార్చేశారు. స్నేహితురాలికి పెళ్లి కాబోతుండటంతో, ఆమెకు గుర్తుండిపోయేలా లోకల్ ట్రైన్లోనే సంప్రదాయ వేడుక నిర్వహించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి వేడుకలు నిర్వహించడం సరైనదేనా ? అంటూ చర్చ మొదలుపెట్టారు.
అసలు ఏం జరిగిందంటే
మహారాష్ట్రలో పెళ్లికి ముందు నిర్వహించే సంప్రదాయ వేడుకల్లో 'కెల్వన్' కూడా ఒకటి. పెళ్లి కాబోతున్న వధూవరులకు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రత్యేకంగా భోజనం పెట్టి, ఆశీర్వదించి, పెళ్లికి ముందు సంతోషంగా గడిపేలా ఈ వేడుక నిర్వహిస్తారు. ఇలాంటి వేడుకనే కొంతమంది యువతులు వారి స్నేహితురాలి కోసం ముంబై లోకల్ ట్రైన్లో ఏర్పాటు చేశారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళ స్నేహితురాలికి జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది.
పూలు, డెకరేషన్లతో ముస్తాబైన రైలు బోగీ
సాధారణంగా ప్రయాణికులతో కిక్కిరిసిపోయే రైలు బోగీలో ఈ వేడుక కోసం ప్రత్యేకంగా డెకరేషన్ చేశారు. పూలు, స్టిక్కర్లు, ఇతర డెకరేషన్ వస్తువులతో బోగీలోని ఒక వైపు పండుగ వాతావరణం తీసుకొచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను Xలో షేర్ చేసారు. వీడియోలో కొంతమంది మహిళలు ముందుగానే రైలు బోగీని వేడుకకు ఏర్పాట్లు చేస్తూ కనిపిస్తారు. వారిలో ఒకరు సంప్రదాయ పూజా సామగ్రితో కూడిన పళ్లెం పట్టుకుని ఉండగా, మిగతావారంతా వారి స్నేహితురాలి రాక కోసం ఎదురుచూస్తున్నారు.
స్నేహితురాలు రాగానే పూల వర్షంతో స్వాగతం
కాబోయే వధువు రైలు బోగీలోకి అడుగుపెట్టగానే అక్కడ ఉన్న స్నేహితులంతా ఆమెకు ఘనంగా స్వాగతం పలుకుతూ.. ఆమెపై పూలు చల్లుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తరువాతా ఆమెను కౌగిలించుకుని, వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక నిర్వహించి ఆమెను ఆశీర్వదించారు. సాధారణ రైలు ప్రయాణాన్ని ఇలా ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చుకోవడం కొందరిని ఆకట్టుకుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది నెటిజన్లు ఈ ఆలోచనను అభినందిస్తున్నారు. స్నేహితురాలి పెళ్లిని ఇంత ప్రత్యేకంగా జరుపుకోవాలనుకోవడం మంచి విషయమని, ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఇచ్చారని ప్రశంసిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ వేడుక నిర్వహించిన విధానాన్ని తప్పుబడుతున్నారు.
ముంబై లోకల్ రైళ్లు ప్రజలందరూ ఉపయోగించే ప్రజా రవాణా సౌకర్యమని, వాటిని వ్యక్తిగత వేడుకల కోసం ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిరోజూ వేల మంది ప్రయాణించే రైళ్లలో ఇలాంటి డెకరేషన్లు, వేడుకలు నిర్వహించడం వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
వైరల్ వీడియోపై స్పందించిన రైల్వే శాఖ
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందిస్తూ సంబంధిత రైల్వే అధికారులను ట్యాగ్ చేసింది. ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లామని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
केळवण (Kelvan) A traditional Maharashtrian pre-wedding celebration, where family and friends shower the bride or groom with love, blessings and a special feast. This time, not at home, but aboard a Mumbai local. https://t.co/JvhXAGgF87
— Mumbai Heritage (@mumbaiheritage) November 27, 2026
