విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని అదానీ గ్రూప్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని కోరింది. జస్ట్ ఎయిర్ పోర్ట్స్ నిర్వహణ వ్యాపారంలోనే కాకుండా విమానయాన సంస్థను అభివృద్ధి చేయాలని అదానీ ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ రాబీ సింగ్ మీడియా ముందు వెల్లడించారు. భారత్‌లో విమాన ప్రయాణం చేసే సామర్థ్యం ఉన్న 60 కోట్ల మందికి సేవలు అందించడానికి ప్రస్తుత విమానాల సంఖ్య సరిపోవడం లేదని చెప్పారు.
దేశంలో రోజువారీ విమానాల సంఖ్యను ప్రస్తుతమున్న దానికంటే 10 రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని జుగేషిందర్ రాబీ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ సంఖ్యను 30 వేల విమానాలకు పెంచితేనే దేశీయ డిమాండ్‌ను అందుకోగలమని చెప్పారు. అందుకే పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలని మోడీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. దీనివల్ల విమానయాన సంస్థల అభివృద్ధిని తాము ప్రోత్సహించగలుగుతామని సింగ్ ఇండియా డెట్ క్యాపిటల్ మార్కెట్ సమ్మిట్ లో తెలిపారు.
విమానయాన రంగంలోకి రావాలనుకునే కొత్త పారిశ్రామికవేత్తలకు దీనివల్ల తోడ్పాటు లభిస్తుందని సింగ్ వివరించారు. దేశంలో అన్ ట్యాప్డ్ ఏవియేషన్ డిమాండ్ ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. దేశీయ విమానయాన మార్కెట్లో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా, రాహుల్ భాటియా నేతృత్వంలోని ఇండిగో ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ రెండు సంస్థలే 90 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న సమయంలో అదానీ ఈ వ్యాపారంలోకి ఎంట్రీ కోసం ట్రై చేస్తున్నారు.
గతంలో అదానీ గ్రూప్ విమానయాన వ్యాపారంలోకి నేరుగా రాబోమని తెలిపింది. జూలైలో ఈ విషయంపై గ్రూప్ క్లారిటీ ఇచ్చింది. కస్టమర్లతో పోటీ పడటం సరైన వ్యూహం కాదని అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్ బన్సల్ నవంబర్ 3న చెప్పారు. అదానీ గ్రూప్ ప్రస్తుతం ముంబై, నవీ ముంబై, అహ్మదాబాద్, లక్నో, గువాహటి సహా 8 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. దేశంలోని విమాన ప్రయాణికుల్లో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది ఈ విమానాశ్రయాల నుంచే ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకూ మౌలిక సదుపాయాల విస్తరణతో దూసుకుపోతున్న అదానీ గ్రూప్ ఇకపై విమాన సర్వీసుల అభివృద్ధిలోనూ భాగం కావాలని నిర్ణయించుకుంది.
