అండాల అక్రమ రవాణా వెనుక కార్పొరేట్ నెట్‌వర్క్.. నెలకు రూ.28 కోట్ల ఆదాయం

అండాల అక్రమ రవాణా వెనుక కార్పొరేట్ నెట్‌వర్క్.. నెలకు రూ.28 కోట్ల ఆదాయం

హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనధికారిక అండకణాల సేకరణ, అక్రమ రవాణా ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒయాసిస్ ఫెర్టిలిటీ నిర్వహిస్తున్న సద్గురు హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ప్రతీక్ అనిల్ గగ్లానీ, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేబ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు మల్కాజిగిరి సీపీ సుమతి వెల్లడించారు.

ఈ కేసులో ఇప్పటికే దుర్గా ప్రసాద్, అమిత్, ఎన్. నికాత్ పర్వీన్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 1145/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. హైదరాబాద్‌లో ఒయాసిస్ ఫెర్టిలిటీ పేరుతో సద్గురు హెల్త్‌కేర్ పది కేంద్రాలను నిర్వహిస్తోంది. బంజారాహిల్స్, మియాపూర్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో నాలుగు లెవల్-II IVF క్లినిక్‌లు ఉన్నట్లు గుర్తించారు. మియాపూర్‌లోని సద్గురు ART బ్యాంక్ కేంద్రంగా అండదాతల సేకరణ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఏజెంట్ల ద్వారా మహిళలను అండదాతలుగా గుర్తించి తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అండాల ఉత్పత్తిని ప్రేరేపించే ఇంజెక్షన్లు ఇచ్చిన అనంతరం అండకణాల సేకరణ కోసం వారిని సంతానోత్పత్తి కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు.

2025 నుంచి కంపెనీ COOగా పనిచేస్తున్న ప్రతీక్ అనిల్ గగ్లానీ సంస్థ కార్యకలాపాల నిర్వహణ, వైద్య పరికరాలు, సామగ్రి కొనుగోలు, కొత్త కేంద్రాల ఏర్పాటు వంటి బాధ్యతలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. కంపెనీ CFO ద్వారా నిధుల సమన్వయం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అండదాతల ప్యాకేజీలకు సంబంధించి రోగులకు సమాచారం అందించడం, ART బ్యాంక్ ఇన్‌చార్జ్‌తో తరచూ సంప్రదింపులు జరపడం వంటి కార్యకలాపాల్లోనూ ఆయన పాత్ర ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. యాజమాన్యం సూచనల మేరకు కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచినట్లు విచారణలో గుర్తించామని తెలిపారు.

మరో నిందితుడు డాక్టర్ రాజర్షి దేబ్ 2026 ఏప్రిల్ నుంచి మెడికల్ అడ్మినిస్ట్రేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. క్లినికల్ క్వాలిటీ, ఆపరేషన్ థియేటర్ల సిద్ధత, వైద్యుల నియామకాలను పర్యవేక్షించినట్లు పోలీసులు వెల్లడించారు. అండదాన విధానాలకు అంగీకరించిన వైద్యులనే నియమించాలంటూ యాజమాన్యం సూచించినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ART బ్యాంక్ ఇన్‌చార్జ్ సునీల్ రాయ్‌తో అండదాన కార్యకలాపాలపై తరచూ ఫోన్ ద్వారా సమన్వయం చేసుకున్నట్లు గుర్తించారు.

నెలకు రూ.28 కోట్ల వరకు ఆదాయం?

పోలీసుల వివరాల ప్రకారం.. సంస్థ దేశవ్యాప్తంగా 43 క్లినిక్‌లను నిర్వహిస్తోంది. ప్రతి నెలా సుమారు 600 సెల్ఫ్ ఎగ్ సైకిళ్లు, 100 అండదాత సైకిళ్లు జరుగుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కార్యకలాపాల ద్వారా నెలకు సుమారు రూ.27 నుంచి రూ.28 కోట్ల ఆదాయం వస్తున్నట్లు పోలీసులు అంచనా వేశారు.

కంపెనీ బ్యాంకు ఖాతా లావాదేవీలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 26 వరకు HDFC బ్యాంకు ఖాతాలో జరిగిన డెబిట్, క్రెడిట్ లావాదేవీలను పరిశీలించగా భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

అక్రమ కార్యకలాపాలపై అవగాహన ఉన్నప్పటికీ ఆర్థిక ప్రయోజనాల కోసం వాటిని కొనసాగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

భారీ వేతనాలు.. డిజిటల్ ఆధారాల సేకరణ

COO ప్రతీక్ అనిల్ గగ్లానీకి నెలకు సుమారు రూ.4.20 లక్షల జీతం, డాక్టర్ రాజర్షి దేబ్‌కు నెలకు సుమారు రూ.23.60 లక్షల పారితోషికం అందినట్లు పోలీసులు వెల్లడించారు. అధిక పారితోషికాలు, ఆర్థిక ప్రయోజనాల కోసమే నిందితులు ఈ కార్యకలాపాలకు సహకరించినట్లు దర్యాప్తులో గుర్తించామని పేర్కొన్నారు.

ALSO READ : ఫ్యాక్టరీలో  పోలీసుల స్పెషల్ డ్రైవ్.. 15 మందికి డ్రగ్స్ పాజిటివ్.!

అరెస్టయిన వారి నుంచి డిజిటల్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతీక్ అనిల్ గగ్లానీ నుంచి ఐఫోన్ 13 ప్రోతో పాటు మరో పాత మోడల్ ఐఫోన్‌ను, డాక్టర్ రాజర్షి దేబ్ నుంచి ఐఫోన్ 14 ప్రోను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్లలోని డిజిటల్ సమాచారాన్ని విశ్లేషించి మరిన్ని వివరాలు సేకరించనున్నారు.

మిగిలిన నిందితుల కోసం గాలింపు

అనధికారిక అండకణాల సేకరణ, ART విధానాల నిర్వహణకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని సీపీ సుమతి తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై విచారణ జరుపుతున్నామని, మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.