మోడీ సర్కార్‎కు బిగ్ రిలీఫ్: డీలిమిటేషన్ బిల్లుకు DMK మద్దతు..!

మోడీ సర్కార్‎కు బిగ్ రిలీఫ్: డీలిమిటేషన్ బిల్లుకు DMK మద్దతు..!

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. శనివారం (నవంబర్ 28) చెన్నైలో పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన డీఎంకే ఎంపీల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. 

డీలిమిటేషన్ బిల్లుతో తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలగకూడదని, అలాగే లోక్‌సభలో రాష్ట్రానికి ఇప్పుడున్న 7.18 శాతం సీట్ల వాటా యథాతథంగా కొనసాగించడంతో పాటు 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించిన అన్ని రాష్ట్రాల సీట్ల నిష్పత్తిని మరో 25 ఏండ్ల పాటు కొనసాగించాలన్న తమ ప్రధాన డిమాండ్లను కేంద్ర అంగీకరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే స్పష్టం చేసింది. 

డీఎంకేకు 22 మంది ఎంపీలు ఉన్నారు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు డీఎంకే మద్దతు కేంద్రానికి కీలకంగా మారింది. బిల్లుకు మద్దతిస్తామని ఎన్సీపీ (ఎస్పీ) ఇప్పటికే ప్రకటించడంతో లోక్ సభలో ఎన్డీయే బలం 354కు చేరింది.

ఈ క్రమంలో నియోజకవర్గాల పునర్విభన బిల్లుకు డీఎంకే మద్దతు తెలపడంతో కేంద్రానికి బిగ్ రిలీఫ్ లభించినట్లైంది. డీఎంకే నిర్ణయంతో 2026, నవంబర్ 30న ప్రారంభం కానున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందడం దాదాపు ఖాయమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.