ఫ్యాక్టరీలో  పోలీసుల స్పెషల్ డ్రైవ్.. 15 మందికి డ్రగ్స్ పాజిటివ్.!

ఫ్యాక్టరీలో  పోలీసుల స్పెషల్ డ్రైవ్.. 15 మందికి డ్రగ్స్ పాజిటివ్.!

వికారాబాద్ జిల్లా, పరిగి: మాదకద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి సమీపంలోని సుగుణ ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసులు సైలెంట్ ఆపరేషన్ నిర్వహించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు ముందస్తు సమాచారం తెలియకుండా రహస్యంగా డ్రగ్ పరీక్షలు నిర్వహించారు.సీసీఎస్ పోలీసులు, స్థానిక సివిల్ పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక తనిఖీల్లో పాల్గొన్నారు. డ్రగ్ టెస్టింగ్ కిట్ల సహాయంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో దాదాపు 15 మందికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. వీరంతా గంజాయి సేవించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పరీక్షల ఫలితాలపై అధికారిక నిర్ధారణ, తదుపరి చర్యలకు సంబంధించిన వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

ఒకే ఫ్యాక్టరీలో ఇంతమందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం రావడంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సంబంధిత వ్యక్తులకు గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? ఎవరి ద్వారా సేకరిస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాను అరికట్టేందుకు పోలీసులు చేపట్టిన ఈ సైలెంట్ ఆపరేషన్‌తో పారిశ్రామిక ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది.