యూపీ బీజేపీలో ముసలం..? CM పదవిపై యోగి వర్సెస్ కేశవ్ ప్రసాద్ మౌర్య

యూపీ బీజేపీలో ముసలం..? CM పదవిపై యోగి వర్సెస్ కేశవ్ ప్రసాద్ మౌర్య

లక్నో: అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఉత్తరప్రదేశ్ బీజేపీలో ముఖ్యమంత్రి పదవిపై పొలిటికల్ హీట్ రాజుకుంది. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే యోగీ ఆదిత్యనాథ్ హ్యాట్రిక్ సీఎం అవుతారని.. ఆ తర్వాత ఆయన 2029లో పీఎం అభ్యర్థి రేసులోకి వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. యూపీలో బీజేపీ మూడోసారి గెలిచిన తర్వాత బీహార్‎ మాదిరిగానే యోగీని సీఎం పోస్టు నుంచి తప్పించే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం పదవిపై సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన కామెంట్స్ యూపీ పాలిటిక్స్‎లో కాకరేపుతున్నాయి. 

ఎమ్మెల్యేలదే తుది నిర్ణయం: కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య

వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిపై ఆ పార్టీ కీలక నేత, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలే సీఎం ఎవరనేది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో మా ముఖ చిత్రం కమలమేనని.. ఎవరి ముఖంతోనూ ఎన్నికలకు వెళ్లడం లేదంటూ పరోక్షంగా సీఎం యోగి ఫేస్‎తో ఎన్నికలకు వెళ్లడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం యోగి మా ముఖ్యమంత్రి. ఆయన కొనసాగాలా.. ఇంకెవరైనా బాధ్యతలు చేపట్టాలా అనేది ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో అందరికీ తెలుసు: యోగి

సీఎం అభ్యర్థిపై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై యోగి స్పందించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనేది అందరికీ తెలుసు. మాకు కమలమే అన్నీ. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో.. ఎవరు కాదో అందరికీ తెలుసు’’ అని సీఎం యోగి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.