హిందూ పురాణాల ప్రకారం కార్తీకమాసాన్ని దామోదరమాసం అంటారు. ఇటు శివుడి.. అటు విష్ణువుకి చాలా ఇష్టమైన నెల. అందుకే ఈ నెలలో కార్తీక దామోదరాయనమ: అంటూ పూజలు చేస్తారు. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడి లీలలకు .. దామోదర వ్రతం విశిష్టత గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి దామోదరుడు అనే పేరు రావడం వెనుక ఓ అద్భుతమైన బాల్యలీల ఉందని పండితులు చెబుతున్నారు. పరమాత్ముడిని పెంచిన తల్లి యశోధ ప్రేమకు గుర్తుగా ఈ మాసం శ్రీ కృష్ణుడిని ఆయన తల్లి బంధించిన లీల భక్తి, ప్రేమ గొప్పతనాన్ని చాటిచెబుతుంది. కార్తీక మాసంలో దామోదర లీలను చదవడం, వినడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. అందుకే శ్రీకృష్ణుడిని దామోదరుడు అని కూడా అంటారని పండితులు చెబుతున్నారు.
సంస్కృతంలో దామ అనగా తాడు.. ఉదరం అంటే పొట్ట . అంటే తాడుతో పొట్టను బంధించబడటం అని అర్దం. పరమాత్ముని బాల్యంలో తన అల్లరి చేష్టలకు విసుగెత్తిన తల్లి యశోధ ఆయనను రోలుకు కట్టేసింది. ఈ ఘటన కార్తీకమాసంలో జరిగిందని పండితులు చెబుతున్నారు. సమస్త లోకాలను తన ఉదరంలోను బంధించి.. లోక రక్షకుడిగా ధరించినవాడు దామోదరుడు కాబట్టి.. ఈ నెలను దామోదరమాసం మాసం అంటారని పండితులు చెబుతున్నారు.
సర్వలోకాలను పాలించే పరమాత్ముడు సైతం స్వచ్ఛమైన తల్లి ప్రేమకు లొంగిపోయాడనేది ఈ లీలలోని ప్రధాన సందేశం. భగవంతుడిని బలంతో కాకుండా నిర్మలమైన భక్తితో, ప్రేమతో మాత్రమే చేరుకోగలమని పండితులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పురాణ కథ కూడాఉంది.
శ్రీకృష్ణుని బాల్య లీలలు అన్నీ ఇన్నీ కావు.. ఆయన చేసిన చిలిపి అల్లరి.. గోపికల ఇళ్లలో వెన్నను ఎవరూ చూడకుండా తినడం.. కోతులకు వెన్న పంచడం.. కుండలు పగుల గొట్టడం.. ఇలా ఇకటేమిటి ఆయన చేసిన చిలిపి పనులు అన్నీ ఇన్నీ కావు. ఇలా బాల్యజీవితం కొనసాగిస్తున్న పరమాత్మ రూపంలో (శ్రీకృష్ణుడు.. ) ఉన్న విష్ణుమూర్తి.. ద్వాపర యుగంలో ఒకరోజు యశోదమ్మ ఇంట్లో పాలు కాస్తుండగా కృష్ణుడు ఆకలితో మారాం చేశాడు. దీంతో ఆమె కన్నయ్యకు పాలు ఇస్తుండగా పొయ్యిమీద పాలు పొంగడంతో మధ్యలోనే లేచి వెళ్లింది. దీంతో కోపగించిన కృష్ణుడు వెన్న కుండను పగలగొట్టి వెన్న తినసాగాడు. తిరిగి వచ్చిన యశోదమ్మ ఇది చూసి కన్నయ్యను పట్టుకుని తాడుతో రోటికి కట్టాలని ప్రయత్నించింది. అయితే ఎన్ని తాళ్లు కలిపినా ప్రతిసారీ రెండు అంగుళాలు తక్కువయ్యేవి. చివరకు తల్లి పడుతున్న శ్రమను చూసిన కృష్ణుడు ఆమె ప్రేమకు కరిగిపోయి బంధనానికి అంగీకరించాడు. అలా యశోదమ్మ తన బిడ్డను రోటికి కట్టేసిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
రోటికి కట్టబడి ఉన్న కృష్ణుడు దానిని లాక్కుంటూ రెండు పెద్ద మద్ది చెట్ల మధ్య నుంచి వెళ్లాడు. దీంతో ఆ చెట్లు నేలకూలి, వాటి నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వచ్చారు. వారే కుబేరుడి కుమారులైన నలకూబరుడు, మణిగ్రీవుడు. ఒకప్పుడు సంపద, ఐశ్వర్యంతో అహంకరించిన వీరు నారద మహర్షి పట్ల అమర్యాదగా ప్రవర్తించడంతో ఆయన శాపానికి గురయ్యారు. భూమిపై మద్ది చెట్లుగా జన్మించారు. శ్రీకృష్ణుడి స్పర్శతోనే శాపవిముక్తి లభిస్తుందని నారదుడు వరమిచ్చాడు. ఆ విధంగా కృష్ణుడి అనుగ్రహంతో వారు తిరిగి దివ్యరూపాలను పొంది దేవలోకానికి చేరుకున్నారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు
కార్తీక మాసంలో శ్రీకృష్ణుడిని దామోదర రూపంలో పూజించడం విశేష ఫలప్రదమని భక్తుల నమ్మకం.దామోదర మాస మంతా ప్రతిరోజూ సాయంత్రం దీపారాధన చేసి, దామోదరాష్టకాన్ని పఠిస్తారు. అలాగే దామోదర లీలను చదవడం, వినడం, స్మరించుకోవడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. అందుకే ఈ పవిత్ర మాసంలో దామోదరుడిని స్మరించిన వారికి శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
