తిరుమల: తిరుమలలో భక్తుడు పోగొట్టుకున్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను కమాండ్ కంట్రోల్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చాకచక్యంగా గుర్తించి, తిరిగి బాధిత భక్తుడికి అప్పగించారు. భక్తుల భద్రతతో పాటు వారి విలువైన వస్తువుల పరిరక్షణలో తిరుమల కమాండ్ కంట్రోల్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన భక్తుడు జి. మహేష్ 2026 నవంబరు 27వ తేదీ సాయంత్రం సుమారు 4:30 గంటలకు కారులో ప్రయాణిస్తూ, సీఆర్ఓ కార్యాలయం బస్ స్టాప్ వద్ద అత్యవసరంగా దిగే సమయంలో తన వద్ద ఉన్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను పొరపాటున జారవిడిచారు. ఆ సమయంలో ఈ విషయాన్ని గమనించని ఆయన, కొద్దిసేపటి తర్వాత ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే తిరుమల కమాండ్ కంట్రోల్ సిబ్బందిని సంప్రదించారు.వెంటనే స్పందించిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది సంబంధిత ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆభరణాలను తీసుకున్నట్లు గుర్తించి, వారి కదలికలను సీసీటీవీ ప్లేబ్యాక్ ద్వారా విశ్లేషించారు.
మొదటి వ్యక్తి నుంచి 52 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొదటి వ్యక్తి తిరువణ్ణామలైకు చెందిన భక్తుడిగా గుర్తించారు. అతని లగేజీ వివరాలను సేకరించి, ఫోన్ ద్వారా ఆభరణాలు మరొక భక్తునికి చెందినవని తెలియజేశారు. దీంతో అతడిని తిరువణ్ణామలై నుంచి తిరుమలకు రప్పించి, అతని వద్ద ఉన్న రెండు బంగారు గొలుసులు, ఒక బంగారు బ్రాస్లెట్ను 2026 నవంబరు 28వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటలకు స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు సుమారు 52 గ్రాములు.
రెండో వ్యక్తి ఉచిత దర్శనానికి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ప్లేబ్యాక్ సహాయంతో అతని కదలికలను ట్రాక్ చేయగా, నారాయణగిరి షెడ్ నంబరు-7లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది అతని వద్ద ఉన్న సుమారు 8 గ్రాముల బంగారు ఉంగరాన్ని ఉదయం 5:30 గంటలకు స్వాధీనం చేసుకున్నారు.
ఈ విధంగా మొత్తం సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది, 2026 నవంబరు 28వ తేదీ ఉదయం 6:30 గంటలకు బాధిత భక్తుడు జి. మహేష్‌కు తిరిగి అందజేశారు.
తన విలువైన ఆభరణాలు తిరిగి లభించడంతో భక్తుడు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వీడియో రూపంలో ఫీడ్‌బ్యాక్ రిజిస్టర్లో నమోదు చేసి, టీటీడీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
అధికారులకు, సిబ్బందికి అభినందనలు
టీటీడీ సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణ ఆదేశాల మేరకు, భక్తుడు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను తిరిగి అందించేందుకు విశేష కృషి చేసిన టీటీడీ విజిలెన్స్ అధికారి సురేంద్ర, ఏవీఎస్వో వెంకటరమణ, ఇతర అధికారులు, కమాండ్ కంట్రోల్ సిబ్బందిని భక్తులు అభినందించారు.సీసీటీవీ నిఘా, నిరంతర పర్యవేక్షణ, సమర్థవంతమైన ప్లేబ్యాక్ విశ్లేషణ, అధికారుల సమన్వయంతో విలువైన ఆభరణాలను తక్కువ సమయంలోనే రికవరీ చేయడం ప్రశంసనీయమని అన్నారు.
