భూమి ఉపరితలం నుంచి దాదాపు 1600 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న అనేక వాయువుల మిశ్రమాన్ని వాతావరణం అంటారు. ఈ వాతావరణంలో క్లోరిన్ వాయువులు తప్ప మిగిలిన అన్ని వాయువులు ఉంటాయి. 90 శాతం వాతావరణం భూ ఉపరితలం నుంచి కేవలం 50 కి.మీ.ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నది. కారణం వాతావరణం అంతా అధిక బరువైన నైట్రోజన్, ఆక్సిజన్ వంటి వాయువులతో ఏర్పడి ఉన్నది. భూ ఉపరితలం నుంచి వాతావరణంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలో కలిగే మార్పుల ఆధారంగా వాతావరణాన్ని ఐదు ఆవరణాలుగా విభజించారు. అవి.. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, ఐనో ఆవరణం, ఎక్సో ఆవరణం.
ట్రోపో ఆవరణం
భూమి ఉపరితలం నుంచి సగటున 13 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న వాతావరణంలోని మొదటి పొరను ట్రోపో ఆవరణం అంటారు. ఈ ఆవరణాన్ని రీజియన్ ఆఫ్ మిక్సింగ్ అని టస్సారిస్ డీబార్డ్ అనే శాస్త్రవేత్త పిలిచారు. ట్రోపో అంటే మార్పు అని అర్థం. ఇది భూమధ్య రేఖ వద్ద 18 కి.మీ., ధ్రువాల వద్ద 8 కి.మీ.ల ఎత్తును కలిగి ఉంటుంది. ఈ ఆవరణంలో ప్రతి 165 మీటర్ల ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత 1 డిగ్రీ చొప్పున తగ్గుతుంది. దీనినే సాధారణ ఉష్ణోగ్రత క్షీణతాక్రమం అంటారు. 99 శాతం దుమ్ము, ధూళి కణాలు, నీటి ఆవిరి ఈ ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉండటంతో వాతావరణ పొరలన్నింటిలో ఇది అధిక సాంద్రతను కలిగి ఉంటుంది.
ద్రవీభవనం, మేఘాల నిర్మాణం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం, అల్ప పీడనాలు మొదలైన 75 శాతం జీవక్రియలు ఈ ఆవరణంలో జరగడం మూలంగా ఈ ఆవరణాన్ని జీవావరణం అని కూడా అంటారు. ఈ ఆవరణంలో జెట్‌స్ట్రీమ్స్ వల్ల వాతావరణంలో అనేక రకాల గందరగోళ పరిస్థితులు ఏర్పడటం వల్ల దీనిని గందరగోళ ఆవరణం/ సంక్షుబ్ది ఆవరణం అంటారు.
స్ట్రాటో ఆవరణం
ట్రోపో పాస్ నుంచి 50 కి.మీ.ల ఎత్తు వరకు గల వాతావరణంలోని రెండో పొరను స్ట్రాటో ఆవరణం అంటారు. ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. దీని కారణంగా ఇక్కడి వాతావరణం అలజడులకు లోను కాకుండా ప్రశాంతంగా ఉండటంతో విమానయానానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఆవరణంలో 25 కి.మీ. నుంచి 35 కి.మీ.ల ప్రాంతంలో ఓజోన్ పొర కేంద్రీకృతమై ఉండి ఘాటైన చేపల వాసన కలిగి ఉంటుంది. ఓజోన్ పొర భూమి వైపు ప్రసరించే ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలను నియంత్రిస్తున్నది. ఈ పొరకు రంధ్రాలు పడటానికి కారణం క్లోరో ఫ్లోరో కార్బన్స్.
మీసో ఆవరణం
స్ట్రాటో పాస్ నుంచి 80 కి.మీ.ల వరకు గల వాతావరణంలోని మూడో పొరను మీసో ఆవరణం అంటారు. ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత అధిక స్థాయిలో పతనమవుతుంది. ఈ కారణంగా వాయు అణువుల్లో గల గతిశీలత లోపించి నిశ్చల స్థితిలో ఉన్నందున ఘర్షణ బలాలు జనిస్తాయి. ఈ ఆవరణంలోనే ఉల్కాపాతాలు సంభవిస్తాయి. ఈ ఆవరణ లక్షణాలు అన్నీ ట్రోపో ఆవరణ లక్షణాల లాగా ఉండటంతో దీనిని బాహ్య ట్రోపో వాతావరణం అని అంటారు.
ఐనో/ థర్మో ఆవరణం
మీసో పాస్ నుంచి 400 కి.మీ.ల వరకు గల వాతావరణంలోని నాలుగో పొరనే ఐనో/ థర్మో ఆవరణం అంటారు. ఈ ఆవరణంలోని వాయువులు అయాన్ల రూపంలో ఉండటంతో వాటి మధ్య చర్యలు జరిగి శక్తి, ఉష్ణం విద్యుదయస్కాంత తరంగాల రూపంలో విడుదల అవుతుంది. దీని కారణంగా రేడియో, దూరదర్శన్ తరంగాలు భూమి మీదకు పరావర్తనం చెందడం వల్ల సమాచార వ్యవస్థ అధిక స్థాయిలో అభివృద్ధి చెందింది. కాబట్టి దీనిని సమాచార వ్యవస్థ పొర అంటారు.
వాయువులు అయాన్ల రూపంలో ఉంటాయి. కాబట్టి దీనిని ఐనో ఆవరణం అంటారు.
ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. కాబట్టి దీనిని థర్మో ఆవరణం అని కూడా అంటారు. ఈ ఆవరణంలో స్పేస్ స్టేషన్ నిర్మించారు. ఈ ఆవరణంలో స్పేస్ షటిల్స్ తిరుగుతాయి. ఇది వాతావరణంలో తక్కువ సాంద్రత గల ఆవరణం.
ఎక్సో ఆవరణం
ఐనో పాస్‌కు పైన గల మిగిలిన ఆవరణాన్ని ఎక్సో ఆవరణం అంటారు. ఈ ఆవరణంలో పదార్థం ప్లాస్మా స్థితి (పదార్థం నాలుగో స్థితి)లో ఉంటుంది. ఎక్సో ఆవరణంలోనే కృత్రిమ ఉపగ్రహాలు (భూమి నుంచి 36,000 కి.మీ.ల ఎత్తులో) ప్రవేశపెడతారు. భూ వాతావరణం నుంచి 64,000 కి.మీ.ల ఎత్తులో ఉన్న అయస్కాంత వికిరణ మేఖలను వ్యాన్ అలెన్ వికిరణ మేఖల అంటారు.
వ్యాన్ అలెన్ వికిరణ మేఖల భూమి మీదకు ప్రసరించే సౌర పవనాలను నియంత్రించి భూమి మీద జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నది.
ట్రోపో, స్ట్రాటో, మీసో ఆవరణాలను కలిపి ఏకావరణం అంటారు. ఐనో, ఎక్సో ఆవరణాలను కలిపి విరుద్ధ ఆవరణం అంటారు.
– వెలుగు, ఎడ్యుకేషన్
