కూకట్‌పల్లిలో విషాదం.కార్తీక దీపం చీరకు అంటుకుని యువతి మృతి..

కూకట్‌పల్లిలో విషాదం.కార్తీక దీపం చీరకు అంటుకుని యువతి మృతి..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక దీపం కారణంగా చీరకు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడిన 18 ఏళ్ల యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న సాయి వెంకట సింధు రోడ్ నంబర్ 5లో ఎస్ఎస్ బొటీక్ నిర్వహిస్తోంది.  నవంబర్  12వ తేదీ రాత్రి షాప్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఇంటి గేటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గేటు వద్ద వెలిగించిన కార్తీక దీపం ప్రమాదవశాత్తూ ఆమె చీరకు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో సింధు తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె ప్రాణాలు కోల్పోయింది.

చిన్న వయసులోనే వ్యాపారాన్ని నిర్వహిస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న సింధు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె మరణవార్తతో అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.