- కొత్త ఐఏఎల్‌ఏలకు 65:35, ఇతర ప్రాంతాలకు 50:50 నిష్పత్తి
హైదరాబాద్, వెలుగు: పారిశ్రామిక పార్కుల నిర్వహణ కోసం గ్రామ పంచాయతీలకు చెందిన పలు అధికారాలు, విధులను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)కు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్పేరిట జీవో జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్లు 64–74 (పన్నులు, ఆర్థిక అంశాలు), 75–118 (ప్రజా భద్రత, వసతులు, ఆరోగ్యం), 119–140 (సాధారణ నిబంధనలు), 261–285 (ఇతర నిబంధనలు), 286–297 (నియమాలు, బై–లాస్, జరిమానాలు) పరిధిలోని అధికారాలను టీజీఐఐసీ వినియోగించుకోనుంది. కొత్తగా ఏర్పాటైన పారిశ్రామిక ప్రాంత స్థానిక సంస్థ (ఐఏఎల్‌ఏ–పరిశ్రమలు లేని ప్రాంతాలు) పరిధిలో సమకూరే ఆదాయాన్ని టీజీఐఐసీ, సంబంధిత గ్రామ పంచాయతీ మధ్య 65:35 నిష్పత్తిలో పంపిణీ చేస్తారు. ఇతర ప్రాంతాల్లో 50:50 నిష్పత్తిలో వాటా ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలోని తోగర్‌పల్లి పారిశ్రామిక పార్కుకు సంబంధించి తోగర్‌పల్లి గ్రామ పంచాయతీలోని 43.15 ఎకరాలు, అలియాబాద్ పంచాయతీలోని 00.25 గుంటల విస్తీర్ణంలో ఈ బదిలీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
