కరీంనగర్ లో సంగీత కళాశాల శిలాఫలకంపై సీఎం రేవంత్ రెడ్డి పేరు

కరీంనగర్ లో సంగీత కళాశాల శిలాఫలకంపై సీఎం రేవంత్ రెడ్డి పేరు
  • ఎంపీ వంశీకృష్ణ లేఖపై స్పందించిన జిల్లా యంత్రాంగం
  • సీఎం పేరు, సంబంధిత శాఖల మంత్రుల పేర్లతో కొత్త శిలాఫలకం ఏర్పాటు

కరీంనగర్, వెలుగు: మంథని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రారంభోత్సవ శిలాఫలకం వివాదం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జోక్యంతో ఎట్టకేలకు సద్దుమణిగింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు ఆవిష్కరించిన ఈ శిలాఫలకంపై సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల పేర్లు కనిపించకపోవడంతో ప్రభుత్వ ప్రోటోకాల్‌‌, సీఎం పదవికి ఇవ్వాల్సిన గౌరవంపై ప్రశ్నలు తలెత్తిన విషయం తెలిసిందే. 

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎంపీ వంశీకృష్ణ, శిలాఫలకాన్ని తక్షణమే సరిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు గురువారం లేఖ రాశారు. ఎంపీ లేఖపై అధికారులు స్పందించి సీఎం రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖల మంత్రుల పేర్లు ఉన్న శిలాఫలకాన్ని 24 గంటల్లో తయారు చేయించి పెట్టారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలు వ్యక్తిగత ప్రచారానికి వేదికలు కావని, సీఎం పదవిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కాగా, ప్రభుత్వ కార్యక్రమా ల్లో ప్రోటోకాల్ పాటించడం, రాజ్యాంగబద్ధమైన పదవులను గౌరవించడం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఆఫీసర్లకు మరోసారి గుర్తుచేసింది.  సీఎం రేవంత్ రెడ్డి గౌరవాన్ని నిలబెట్టిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.