- ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసులు ఎక్కువగా ఉన్నాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సికిల్‌సెల్ ఎనీమియా, తలసేమియా, హిమోఫిలియా కేసులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు.
వ్యాధి నిర్మూలన కోసం ప్రజలకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, హాస్పిటళ్ల అభివవృద్ధిపై ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానలకు నేరుగా సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ నుంచి మెడిసిన్స్ పంపిణీ చేస్తున్నట్లుగా.. జిల్లాల్లోని బస్తీ దవాఖానలకు కూడా చేయాలని చెప్పారు.
సబ్ సెంటర్లు అన్నింటినీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వస్తానని, అప్పటిలోగా హాస్పిటళ్ల పనితీరు మరింత మెరుగు అవ్వాలని స్పష్టం చేశారు. ఈలోగా హాస్పిటళ్ల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి అందజేయాలన్నారు.
అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే విధంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. వరంగల్, హన్మకొండ సహా పలు జిల్లాల్లోని సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటల్స్‌లో డాక్టర్ల అటెండెన్స్ తక్కువగా ఉంటోందని, డీసీహెచ్‌ఎస్‌లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. 90 శాతం వైద్య సేవలను స్థానికంగానే అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంతో సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటళ్లు అత్యంత కీలకం అని, వాటి పనితీరు మరింత మెరుగు పడాలన్నారు.
