ఆటో మీటర్ చార్జీలు పెంచాల్సిందే!.ఆటో డ్రైవర్ల డిమాండ్..ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు ముట్టడి

ఆటో మీటర్ చార్జీలు పెంచాల్సిందే!.ఆటో డ్రైవర్ల డిమాండ్..ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు ముట్టడి

హైదరాబాద్, వెలుగు:  తమిళనాడు తరహాలో ఆటో కనీస ఛార్జీ రూ. 50 గా నిర్ణయించాలని, ప్రతి కిలో మీటర్ కు రూ. 25 చొప్పున పెంచాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయాన్ని వేలాది మంది ఆటో డ్రైవర్లు ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఆటో డ్రైవర్లు తమ సమస్యలకు సంబంధించిన ప్లే కార్డులను  పట్టుకొని, నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో  ఇచ్చిన హామీ మేరకు, వారి పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సహాయం ఇప్పటి వరకు అందలేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా...తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం రవాణా రంగా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఆటో డ్రైవర్ల కడుపుకొట్టే గ్రీన్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం టాక్సీల అనుమతులు రద్దు చేయాలని, జిల్లాల్లో ర్యాపిడో ఆటో, బైక్ లను నిషేధించాలని కోరారు.

ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకుంటే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని  హెచ్చరించారు. అనంతరం రవాణా శాఖ జాయింట్ కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్ కు వారు వినతి పత్రం అందించారు. వారి సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ముట్టడి కార్యక్రమంలో రాష్ట్ర ఆటో డ్రైవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనియన్ ప్రతినిధులు వెంకటేశం, సలీం, మారయ్య, సత్తిరెడ్డి, ప్రవీణ్, కోటయ్య, యాదగిరి, మజీద్, అమానుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.