కమర్షియల్ లెక్కలు లేవు.. ఓన్లీ ఎమోషన్ మాత్రమే: దీప్తి గంటా

కమర్షియల్ లెక్కలు లేవు.. ఓన్లీ ఎమోషన్ మాత్రమే: దీప్తి గంటా

‘అలియాస్ రుక్మిణి’ ప్రేక్షకులకు గుర్తుండిపోయే మంచి సినిమా అని నిర్మాత దీప్తి గంటా అన్నారు.  నితిన్ హీరోగా ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. హీరో నాని సమర్పణలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దీప్తి గంటా మాట్లాడుతూ ‘‘కథ విన్నప్పుడే చాలా నచ్చింది.  దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ చెప్పిన రెండున్నర గంటల నేరేషన్‌‌ను ఎంతో ఎంజాయ్ చేశా.  ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎమోషనల్‌‌గా కథను చెప్పారు.

 ముఖ్యంగా క్లైమాక్స్ నన్ను బాగా ఆకట్టుకుంది. ప్రేక్షకులకు కూడా ఒక మంచి అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉంది.  ఈ కథలోని కృష్ణ పాత్రకు నితిన్ అయితే బాగుంటుందని నాని చెప్పారు. మేము కథ చెప్పగానే నితిన్‌‌కు నచ్చి వెంటనే ఓకే చేశారు. నితిన్ పోషించిన కృష్ణ క్యారెక్టర్‌‌‌‌తో  ప్రేక్షకులు ట్రావెల్ చేస్తారు. సినిమాలోని ప్రతి పాత్ర చాలా సహజంగా, మన ఇంట్లోని మనుషుల్లా ఉంటుంది.  నాని కూడా సినిమా చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. 

 ‘రుక్మిణి’ అనే కలం పేరుతో కథలు రాయడం వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలు సినిమాలో చూడొచ్చు. సెన్సార్ కూడా జీరో కట్స్‌‌తో సర్టిఫికెట్ ఇచ్చింది.   ఈ సినిమా  విషయంలో ఎలాంటి కమర్షియల్ లెక్కలు వేసుకోలేదు. ఒక మంచి సినిమా చేశామనే నమ్మకం ఉంది. ఇది ఒకసారి చూసి మర్చిపోయే సినిమా కాదు. చూసిన తర్వాత రెండు రోజుల పాటు ప్రేక్షకులు అందులోని పాత్రల గురించి మాట్లాడుకుంటారు. కృష్ణ క్యారెక్టర్‌‌తో పాటు సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌‌పీరియన్స్ ఇచ్చే గుర్తుండిపోయే సినిమా అవుతుంది” అని చెప్పారు.