- ఫ్రాంక్లిన్ ఎల్. ఖోబుంగ్ నేతృత్వంలో 10 శాఖల అధికారులతో ఐఎంసీటీ ఏర్పాటు
- కరువు సాయం కింద రూ.30 వేల కోట్లు ఇవ్వాలని
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఎల్-నినో ప్రభావంతో ఖరీఫ్–-2026లో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంటర్--–మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ)ను నియమించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ సెక్రటరీ ఫ్రాంక్లిన్ ఎల్. ఖోబుంగ్ నేతృత్వంలో 10 కేంద్ర శాఖల అధికారులతో ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించనుంది. ఈ నెల 15న ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎల్-నినో కారణంగా రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, ఖరీఫ్ పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని వివరించారు. కరువు నివారణ, రైతులను ఆదుకోవడం, తాగునీరు, విద్యుత్ సవాళ్లను అధిగమించేందుకు రూ.30 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, సీఎం విజ్ఞప్తుల నేపథ్యంలో కేంద్రం ఈ బృందాన్ని పంపుతోంది. కేంద్ర ఐఎంసీటీ బృందంలో వ్యవసాయం, ఆర్థిక, నీతి ఆయోగ్, గ్రామీణాభివృద్ధి, తాగునీరు-పారిశుద్ధ్యం, జలవనరులు (సీడబ్ల్యూసీ), ఆహార, ప్రజా పంపిణీ, పశుసంవర్ధక, పంటల విభాగం, ఎంఎన్‌సీఎఫ్‌సీ అధికారులు ఉన్నారు. ఈ బృందం పంట నష్టం, తాగునీరు, జలాశయాల నిల్వలు, గ్రామీణ జీవనోపాధి పరిస్థితులను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.
ఈ నివేదిక ఆధారంగానే ఎన్‌డీఆర్‌ఎఫ్ నుంచి రాష్ట్రానికి కరువు సహాయక నిధులు విడుదల కానున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కరువు మండలాలపై ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 621 మండలాల్లో 31 జిల్లాల పరిధిలోని 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఇందులో 111 మండలాలను తీవ్ర కరువు, 254 మండలాలను మధ్యస్థ కరువు ప్రాంతాలుగా వర్గీకరించింది. ఈ నోటిఫికేషన్ గెజిట్ తేదీ నుంచి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. కరువు ఉత్తర్వుల మేరకు పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని, రుణ వసూళ్ల కోసం రైతులపై ఒత్తిడి తేకుండా ఎస్‌ఎల్‌బీసీ ద్వారా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించింది. తాగునీరు, పశుగ్రాసం, ఉపాధి పనులు చేపట్టాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.
