హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం (నవంబర్ 27) ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 37 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తన సిబ్బందితో కలిసి రూట్ వాచ్‌లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు.
తెలంగాణలో ఇతర రాష్ట్రాల మద్యాన్ని అనుమతి లేకుండా తీసుకురావడం, నిల్వ చేయడం, విక్రయించడం, రవాణా చేయడం నిషేధమని అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం కొనుగోలు చేసి తెలంగాణలోకి తీసుకురావద్దని విమాన ప్రయాణికులకు సూచించారు. విమానాశ్రయంలో ఎక్సైజ్ శాఖ నిఘా, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు
